Fake News, Telugu
 

అమెరికా ప్రభుత్వం దీపావళి పండగ రోజుని ప్రభుత్వ సెలవుగా ప్రకటించలేదు

0

“అమెరికాలో మొట్టమొదటిసారి దీపావళి పండగకి ప్రభుత్వ సెలవు… దీపాలతో అలంకరించబడనున్న టైమ్స్ స్క్వేర్”, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అమెరికా ప్రభుత్వం మొట్టమొదటిసారి దీపావళి పండగ రోజుని ప్రభుత్వ సెలవుగా ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): దీపావళి పండగ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటిస్తూ అమెరికా ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఇదివరకు కూడా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద దీపావళి పండగను జరుపుకున్నారు. దీపావళి పండగ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించాలని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజకుమార్ 2021 మార్చ్ నెలలో న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. కాని, ఈ బిల్లుని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ ఇంకా ఆమోదించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన సమాచారం కోసం అమెరికా ప్రభుత్వ వెబ్సైటులో వెతికితే, అమెరికా ఫెడరల్ ప్రభుత్వం డిక్లేర్ చేసిన ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి పండగ రోజు (04 నవంబర్ 2021) చేర్చలేదని తెలిసింది.  ఒకవేళ, అమెరికా ప్రభుత్వం దీపావళి పర్వదినాన్ని ప్రభుత్వ సెలవుగా ప్రకటించి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కాని, దీని గురుంచి ఏ వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేయలేదు.

అమెరికాలోని ప్రవాస భారతీయులు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద దీపావళి వేడుకను జరుపుకోవడం ఇది మొదటిసారి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రవాస భారతీయులు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద దీపావళి వేడుకను జరుపుకుంటున్న వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అయితే, దీపావళి పండగ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించాలని న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజకుమార్ 2021 మార్చ్ నెలలో ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కాని, ఈ బిల్లుని న్యూయార్క్ అసెంబ్లీ ఇంకా ఆమోదించలేదు. 2018లో దీపావళి పండగ రోజుని న్యూయార్క్ లోని కొన్ని స్కూల్స్ సెలవుగా ప్రకటించాయి. కాని, ఈ సంవత్సరం న్యూయార్క్ స్కూల్స్  సెలవుల జాబితాలో దీపావళి పండగని చేర్చలేదు.

చివరగా, అమెరికా ప్రభుత్వం దీపావళి పండగ రోజుని ప్రభుత్వ సెలవుగా ప్రకటించలేదు. ఇదివరకు, దీపావళి పండగ రోజు న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

Share.

About Author

Comments are closed.

scroll