“మన దేవుని(వినాయకుడు) విగ్రహ చిహ్నాలు కుజుడు (Mars) గ్రహంలో NASA శాస్త్రవేతలు కనుగొనడం జరిగింది. మన దేవుళ్లు ఉన్నారు అనడానికి ఇంకెన్ని ఆధారాలు కావాలి” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీనికి మద్దతుగా వినాయకుడి రూపంలో ఉన్న ఓ శిలను చూపిస్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: నాసా(NASA) శాస్త్రవేత్తలు అంగారకుడి(Mars)పై వినాయకుడి విగ్రహాన్ని కనుగొన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): NASA శాస్త్రవేత్తలు మార్స్ గ్రహంపై వినాయకుడి విగ్రహాన్ని కనుగొన్నారు అనే వాదనలో ఎలాంటి నిజం లేదు. NASA వారి మార్స్ క్యూరియాసిటీ రోవర్ 2023లో తీసి పంపిన మార్స్ గ్రహం యొక్క ఓ ఫొటోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు. అలాగే, నాసా(NASA) శాస్త్రవేత్తలు అంగారకుడి(Mars)పై వినాయకుడి విగ్రహాన్ని కన్నుగొన్నట్లు చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది .
అంగారకుడు (Mars) సౌరవ్యవస్థలోని గ్రహాలలో నాలుగవ గ్రహం. దీనికి కుజుడు అనే పేరు కూడా ఉంది. అంగారకుడు (Mars) రంగు కారణంగా ‘అరుణ గ్రహం (Red Planet) అని కూడా పిలుస్తారు. అంగారకుడు (Mars)కు సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.
ఈ వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా నాసా(NASA) శాస్త్రవేత్తలు అంగారకుడి(Mars)పై వినాయకుడి విగ్రహాన్ని కనుగొన్నారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ పోస్టుకు మద్దతు ఇచ్చే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. అలాగే మేము నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను కూడా పరిశీలించాము, అక్కడ కూడా నాసా (NASA) శాస్త్రవేత్తలు అంగారకుడిపై వినాయకుడి విగ్రహాన్ని కనుగొన్నట్లు చెప్పే ఎలాంటి సమాచారం లభించలేదు.
ఇకపోతే ఈ వైరల్ పోస్టుతో పాటు షేర్ చేయబడుతున్న వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలు కలిగిన ఉన్న అధిక నిడివి గల ఓ వీడియో లభించింది. ఈ వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) ‘Tavi Technical Space’ అనే యూట్యూబ్ ఛానెల్ 08 ఆగస్టు మార్చి 2023న షేర్ చేసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, “ఈ వీడియో NASA యొక్క మార్స్ క్యూరియాసిటీ రోవర్ తీసి పంపిన మార్స్ గ్రహం యొక్క అనేక 4k రిజల్యూషన్ చిత్రాలతో అన్ని వీడియో రూపొందించబడింది”.
క్యూరియాసిటీ రోవర్ అనేది NASA యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీచే నిర్మించబడిన రోబోటిక్ స్పేస్‌క్రాఫ్ట్, ఇది కాలిఫోర్నియాలోని పసాదేనా(Pasaden)లోని Caltech (కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) చేత నిర్వహించబడుతుంది. వైరల్ వీడియోలోని దృశ్యాలు కలిగిన ఓ చిత్రాన్ని NASA యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ వెబ్‌సైట్‌లో మేము గుర్తించాము.
ఈ ఫోటో వివరణ ప్రకారం, అంగారకుడిపై “జౌ(Jau)” అనే ఒక క్రేటర్ కు సంబంధించిన దృశ్యాలను ఈ ఫోటో చూపిస్తుంది. ఇది రోవర్ యొక్క మాస్ట్ క్యామ్‌ని ఉపయోగించి 25 జూలై 2023న మిషన్ యొక్క 3,899వ మార్షియన్ రోజు తీసినట్లు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని 03 ఆగస్టు 2023న ప్రచురించబడింది. మేము వైరల్ వీడియోలోని దృశ్యాలను ఈ చిత్రంతో పోల్చగా, రెండు ఒకటే అని గుర్తించాము. మేము రెండు విజువల్స్‌లో ఒకే విధమైన నిర్మాణాలను గుర్తించాము- పెద్ద నలుపు రంగు రాయి లాంటి నిర్మాణం మరియు చిన్న గోధుమ రంగు నిర్మాణం. ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియో ఎడిట్ చేసి రూపొందించారు స్పష్టంగా తెలుస్తుంది. గోధుమ రంగులో ఉన్న ఆకారం వినాయకుడి రూపంలోకి మారడం మనం చూడవచ్చు, దీన్ని బట్టి ఈ చిత్రాన్ని జూమ్ చేసి ఎడిట్ చేయడం ద్వారా ఈ వీడియో సృష్టించబడిందని మేము నిర్ధారించాము.క్యూరియాసిటీ రోవర్ గురించి మరింత సమాచారం ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
అలాగే ఇంతకుముందు కూడా UFO Sightings Daily అనే సంస్థ మార్స్‌పై ఒక పెద్ద బుద్ధ విగ్రహం ఉందని, 2015లో క్యూరియాసిటీ రోవర్ ఒక మహిళ రూపం ఉన్న ఫోటో పంపిందని పేర్కొంది. అయితే, వీటిపై NASA ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవన్నీ ఊహాజనిత చిత్రాలు, అంటే NASA విడుదల చేసిన ఫోటోలలోని ఆకారాలు బుద్ధుడి రూపాన్ని లేదా స్త్రీ రూపాన్ని పోలి ఉన్నట్లుగా మనం ఊహించుకోవడం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
చివరగా, NASA శాస్త్రవేత్తలు మార్స్ గ్రహంపై వినాయకుడి విగ్రహాన్ని కనుగొన్నారు అనే వాదనలో ఎలాంటి నిజం లేదు. NASA 2023లో విడుదల చేసిన మార్స్(అంగారక) గ్రహానికి చెందిన ఓ ఫొటోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు.