బెంగుళూరులోని CSI చర్చిలో ఒక BJP కార్యకర్త పాస్టర్ చేతిలోని మైక్రోఫోన్ లాక్కొని అతని తల పగల కొట్టినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బెంగుళూరులోని CSI చర్చిలో ఒక BJP కార్యకర్త పాస్టర్ చేతిలోని మైక్రోఫోన్ లాక్కొని అతని తల పగలగొట్టాడు, దానికి సంబంధించిన వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ ఘటన 2018లో తెలంగాణలోని కొత్తగూడెంలో జరిగినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. గతంలో చర్చి కమిటీ నుండి బహిష్కరించబడ్డ సభ్యులు పాస్టర్‌పై దాడి చేసారని, దాడి చేసిన వారు కూడా క్రైస్తవులేనని ఈ కథనం స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చూపిస్తున్నట్టు చర్చి పాస్టర్‌పై దాడి జరిగిన ఘటన నిజమే అయ్యినప్పటికీ, ఈ దాడిలో ఎటువంటి రాజకీయ కోణం లేదు. పైగా ఈ ఘటన జరిగింది బెంగుళూరులో కాదు, తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలో.
ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే పాస్టర్ తెలుగులో మాట్లాడడం గమనించొచ్చు. దీని ఆధారంగా వెతకగా 2018లో ఈ ఘటనను రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది (ఇక్కడ). ఈ కథనం ప్రకారం తెలంగాణలోని కొత్తగూడెంలోని ఒక చర్చిలో ఈ ఘటన జరిగింది. చర్చి పాస్టర్ ఆనంద రావుపై గతంలో చర్చి కమిటీ నుండి బహిష్కరించబడ్డ సభ్యులు దాడి చేసారు. కాగా దాడి చేసిన వారు కూడా క్రైస్తవులేనని ఈ కథనం స్పష్టం చేసింది.
దీన్నిబట్టి ఈ వీడియోలోని ఘటనకు బెంగుళూరుతో గానీ లేక BJPతో గానీ ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. ఐతే గతంలో ఒకసారి ఇదే ఘటన కన్యాకుమారిలో జరిగిందంటూ సోషల్ మీడియాలో షేర్ అవడంతో తమిళనాడు పోలీసులు దీన్ని ఖండిస్తూ, ఈ ఘటన తెలంగాణలో జరిగిందని తెలిపారు. గతంలో కూడా ఈ వీడియో షేర్ అయినప్పుడు, FACTLY దీన్ని ఫాక్ట్-చెక్ చేస్తూ రాసిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
చివరగా, చర్చి పాస్టర్‌పై దాడి చేసిన ఈ ఘటన 2018లో తెలంగాణలో జరిగింది, పైగా ఈ దాడితో BJPకు ఎటువంటి సంబంధం లేదు.