Fake News, Telugu
 

జస్టిస్ అరుణ్ మిశ్రా వేరే నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలను మోదీ ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు

0

మోదీ ప్రభుత్వం మద్దతుతోనే టెలికాం కంపెనీలు 92 వేల కోట్ల బకాయిలు ఎగవేసరని, ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా మాట్లాడుతూ ‘ఈ దేశంలో న్యాయం లేదు, వేరే దేశానికి వెళ్ళిపోవడమే బెటర్’ అని వ్యాఖ్యానించాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: టెలికాం కంపెనీలు 92 వేల కోట్ల బకాయిలు ఎగవేత నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వానికి, టెలికాం కంపెనీలకు మధ్య అడ్జస్టడ్ గ్రాస్ రెవిన్యూ (AGR) విషయంలో జరుగుతున్న కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన తీర్పుకి వ్యతిరేకంగా డిపార్టుమెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) లోని ఒక డెస్క్ అధికారి అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్, ఇతర అధికారులకు రాసిన లేఖపై స్పందిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేసారేగానీ, టెలికాం కంపెనీలు బకాయిలు ఎగవేయడానికి మోదీ ప్రభుత్వం మద్దతిచ్చిందన్న ఆరోపణపై కాదు. పైగా సుప్రీం కోర్టు టెలికాం కంపెనీలకు బకాయిలు చెల్లించడానికి 2031 వరకు గడువునిచ్చింది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

అడ్జస్టడ్ గ్రాస్ రెవిన్యూ (AGR) :

ఇంతకుముందు టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట లైసెన్స్ ఫీజు చెల్లించి తమ వ్యాపారాన్ని నిర్వహించుకోనేవి. ఐతే 1999లో ఈ లైసెన్స్ ఫీజు చెల్లించే పద్దతిని రద్దు చేసి రెవెన్యూ షేరింగ్ మోడల్ ని ప్రారంభించారు. ఈ కొత్త మోడల్ లో టెలికాం కంపెనీలు తమ సంస్థ అందించే ఏయే సర్వీసెస్ ద్వారా అర్జించబడే ఆదాయాన్ని ప్రభుత్వంతో షేర్ చేసుకోవాలో చెప్తూ అడ్జస్టడ్ గ్రాస్ రెవిన్యూ (AGR) అనే ఒక పద్దతిని రూపొందించారు.

ఐతే కేంద్ర ప్రభుత్వం ఈ AGRలో టెలికాం కంపెనీలు అందించే నాన్ టెలికాం సర్వీసెస్ ద్వారా వచ్చే ఆదాయంలో కూడా ప్రభుత్వానికి వాటా ఉండాలని వాదిస్తుండగా,  టెలికాం కంపెనీలు మాత్రం తమ సంస్థల ద్వారా అందించే కోర్ టెలికాం సర్వీస్ ద్వారా ఆర్జించే ఆదాయంలో మాత్రమే ప్రభుత్వానికి వాటా ఇస్తామని వాదించాయి. ఈ విషయం మీద టెలికాం కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య సుప్రీం కోర్టులో 2005 నుండి కేసు నడుస్తూ వచ్చింది.

అక్టోబర్ 2019లో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్దిస్తూ అడ్జస్టడ్ గ్రాస్ రెవిన్యూ (AGR) లో టెలికాం కంపెనీలు అందించే నాన్ టెలికాం సర్వీసెస్ ద్వారా వచ్చే ఆదాయంలో కూడా ప్రభుత్వానికి వాటా ఉండాలని అభిప్రాయపడింది. ఈ నిర్ణయం వల్ల అప్పటికే టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించినవి తీసేస్తే ఇంకా రూ. 93,520 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఐతే ఫిబ్రవరి 2020లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించడానికి మరికొంత సమయం కోరుతూ టెలికాం సంస్థలు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరుపుతున్న జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్, తాము ప్రభుత్వానికి చెల్లింపులు చెయ్యాలని టెలికాం కంపెనీలకు జారి చేసిన ఆర్డర్ కి వ్యతిరేకంగా, టెలికాం కంపెనీలను డబ్బు చెల్లించాలని వారిపై ఒత్తిడి తేవద్దని మరియు వారిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూసుకోవాలని కోరుతూ అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ మరియు ఇతర అధికారులకు డిపార్టుమెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) లోని ఒక డెస్క్ అధికారి రాసిన లేఖపై తీవ్రంగా స్పందించింది. ఈ లేఖపై స్పందిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా ‘ఈ దేశంలో చట్టం లేదు. ఈ దేశంలో ఉండడం కంటే, దేశం విడిచి వెళ్ళడం మంచిది’ అని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ రాసిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే జస్టిస్ అరుణ్ మిశ్రా కేవలం సుప్రీం కోర్టు ఆర్డర్ కి వ్యతిరేకంగా ఒక డెస్క్ అధికారి రాసిన లేఖను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు చేసాడే తప్ప పోస్టులో ఆరోపిస్తున్నట్టు టెలికాం కంపెనీలు బకాయిలు ఎగవేయడానికి మోదీ ప్రభుత్వం మద్దతునిచ్చిందని కాదు.

పైగా టెలికాం కంపెనీలు అడ్జస్టడ్ గ్రాస్ రెవిన్యూ కింద తాము ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు ఎగవేయలేదు. సెప్టెంబర్ 2020లో సుప్రీం కోర్టు టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి బాకీ ఉన్న మొత్తం 1.6 లక్షల కోట్లు చెల్లించడానికి పది సంవత్సరాల (2031 వరకు) గడువునిచ్చింది.

చివరగా, జస్టిస్ అరుణ్ మిశ్రా వేరే నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలను మోదీ ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll