Fake News, Telugu
 

భీమవరం దేవాలయం దగ్గర మానసిక రోగిపై దాడి సంఘటన వీడియోని, ముస్లిం వ్యక్తి దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) చాలా ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వీడియో వివరణ ప్రకారం, భీమవరం ప్రాంతంలో హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ముస్లిం వ్యక్తిని స్థానికులు పట్టుకుని, రాడ్లు, కర్రలతో దాడి చేసారు. అతని దగ్గర మరిన్ని గుళ్లకు సంబంధించిన జాబితా కూడా ఉందని, అతను ఆలయాలపై దాడులకు పాల్పడే ఒక పెద్ద ముఠాకు చెందిన వ్యక్తి అని చెప్తూ షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. 

వీడియో యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భీమవరంలో హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ముస్లిం వ్యక్తిని స్థానికులు కొట్టారు, దానికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు . ఈ ఘటన 01 నవంబర్ 2024 మధ్యాహ్నం, భీమవరం సమీపంలోని కోదండ రామాలయం దగ్గర జరిగింది. పోలీసుల ప్రకారం దిలీప్ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుండి వచ్చాడని, మూడు సంవత్సరాలుగా భీమవరం చుట్టూ తిరుగుతూ కాగితాలు మరియు ఖాళీ వాటర్‌ బాటిల్స్‌ ఏరుకుంటున్నాడని చెప్పారు. 30 అక్టోబర్ 2024న, కొంత మంది అతన్ని తిడుతూ ఆటపట్టించగా, కలత చెందిన దిలీప్ అమ్మవారికి ఒక నోట్ రాసాడు. 01 నవంబర్ 2024న, దిలీప్ ఆలయం దగ్గర తిరుగుతున్నప్పుడు పూజారి అతనిని ప్రశ్నించినప్పుడు, దిలీప్ అహంకారంగా స్పందించి వివరించడానికి నిరాకరించాడు. ఈ ప్రవర్తనతో స్థానికులు అతడిని కొట్టారు. పోలీసులు అతను మానసిక రోగి అని, మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వైజాగ్‌లోని మెంటల్ హాస్పిటల్‌లో చేర్చినట్లు తెలిపారు. అతని పరిస్థితి కారణంగా ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ ఘటన మతపరమైన కోణం లేదని, అతడు హిందువేనని స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా,మాకు సంఘటనను వివరిస్తున్న డైలీహంట్ కథనం లభించాయి. ఈ కథనం ప్రకారం, 01 నవంబర్ 2024 మధ్యాహ్నం, భీమవరం సమీపంలోని కోదండ రామాలయం వద్ద ఒక అనుమానితుడు తిరుగుతున్నాడు. స్థానికులు అతనిని గమనించి, అతనిపై ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. అతను అర్థం కాని భాషలో మాట్లాడటంతో వారి అనుమానం పెరిగింది. ఇతను రామాలయం వద్ద అనుమానంగా తిరుగుతున్నాడని చూసి, విగ్రహాలు ధ్వంసం చేసేవాడేమో అనే అనుమానం వచ్చి, స్థానికులు అతనిపై కేకలు వేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో, అతనిపై కొందరు దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న భీమవరం టూ టౌన్‌ పోలీసులు అక్కడ చేరుకుని, అతన్ని అరెస్ట్ చేశారు అని మాకు తెలిసింది. 

మేము ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని కనుగొన్నాము. ఆ వ్యక్తి పేరు పోలుమాటి దిలీప్, వయస్సు 35, కులం ఎస్సీ-మాల అని ఉంది. దీనితో అతను ముస్లిం కాదని స్పష్టం అయింది.

సంఘటన గురించి మరింత సమాచారం కోసం మేము భీమవరం టూ టౌన్‌ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాము. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం, దిలీప్ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుండి వచ్చాడని, మూడు సంవత్సరాలుగా భీమవరం చుట్టూ తిరుగుతూ కాగితాలు మరియు ఖాళీ వాటర్‌ బాటిల్స్‌ ఏరుకుంటున్నాడని చెప్పారు. 30 అక్టోబర్ 2024న, కొంత మంది అతన్ని తిడుతూ ఆటపట్టించగా, కలత చెందిన దిలీప్ తన అమ్మవారికి ఒక నోట్ రాసాడు. 01 నవంబర్ 2024న, దిలీప్ ఆలయం దగ్గర తిరుగుతున్నప్పుడు పూజారి అతనిని ప్రశ్నించినప్పుడు, దిలీప్ అహంకారంగా స్పందించి వివరించడానికి నిరాకరించాడు. ఈ ప్రవర్తనతో స్థానికులు అతడిని కొట్టారు. పోలీసులు అతను మానసిక రోగి అని, మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వైజాగ్‌లోని మెంటల్ హాస్పిటల్‌లో చేర్చినట్లు తెలిపారు. అతని పరిస్థితి కారణంగా ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ ఘటన మతపరమైన కోణం లేదని, అతడు హిందువేనని స్పష్టం చేశారు.

చివరిగా, భీమవరం దేవాలయం దగ్గర మానసిక వ్యాధిగ్రస్థుడిని కొట్టిన వీడియో, ముస్లిం వ్యక్తి దేవత విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తప్పుగా షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll