Fake News, Telugu
 

లక్నో పాఠశాల నాటకంలో ‘భారత మాత’ వేషధారణలో ఉన్న బాలికతో నమాజ్ మాత్రమే చేయించినట్టు క్లిప్ చేసిన వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

లక్నో మాళవియా నగర్‌లోని శిశు భారతీయ విద్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ప్రదర్శించిన ఒక నాటకంలో, ‘భారత మాత’ వేషధారణలో ఉన్న అమ్మాయి తలపై కిరీటాన్ని తీసివేసి ఆమెతో నమాజ్ చేయించిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: లక్నో శిశు భారతీయ విద్యాలయంలో ప్రదర్శించిన ఒక నాటకంలో ‘భారత మాత’ వేషధారణలో ఉన్న అమ్మాయి తలపై కిరీటాన్ని తీసివేసి, ఆమెతో నమాజ్ చదివించారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది క్లిప్ చేయబడిన వీడియో. ఈ నాటకం పూర్తి వీడియోలో విధ్యార్ధులు, మతాల పేర్లతో ప్రజలు గొడవలు పెట్టుకోవద్దన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు. ఈ నాటకంలో భాగంగా చీర కట్టుకున్న బాలికతో వివిధ మత ప్రార్థనలను (హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్), ఆయా మత ఆచారాల ప్రకారం చేయించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ చేయబడినదని, మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ క్లీప్ చేసిన వీడియోని షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకున్నట్టు లక్నో పోలీస్ వారు ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.          

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఇదే క్లెయింతో ఒక యూసర్ 15 ఆగస్టు 2022 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. అయితే , ‘ది  టైమ్స్ ఆఫ్ ఇండియా’ జర్నలిస్ట్ అరవింద్ చౌహాన్ ఈ ట్వీట్‌కు బదులిస్తూ, పాఠశాల విధ్యార్ధులు ప్రదర్శించిన నాటకం యొక్క పూర్తి వీడియోని ట్వీట్ చేశారు. ఈ నాటకం యొక్క పూర్తి వీడియోలో, చీర ధరించిన బాలిక వేర్వేరు విద్యార్థులతో కలిసి వివిధ మత ప్రార్ధనలను చేసిన దృశ్యాలని చూడవచ్చు. ఈ నాటకంలో భాగంగా చీర కట్టుకున్న బాలికతో హిందూ, క్రిస్టియన్, సిక్కు మరియు ముస్లిం మత ప్రార్ధనలను వారి వారి మత ఆచారాల ప్రకారం చేయించారు.

లక్నో శిశు భారతీయ విద్యాలయంలో ప్రదర్శించిన ఈ స్టేజ్ ప్లే యొక్క పూర్తి వీడియోని లక్నో పోలీసులు ట్వీట్ చేసారు. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించాలానే ఉద్దేశంతో కొంత మంది సంఘ వ్యతిరేకులు ఈ క్లిప్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని లక్నో పోలీసులు ఈ ట్వీట్లో తెలిపారు. ఈ నాటకం పూర్తి వీడియోలో విధ్యార్ధులు, మతాల పేర్లతో ప్రజలు గొడవలు పెట్టుకోవద్దన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని ఇచ్చినట్టు లక్నో పోలీసులు మరొక ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ఈ క్లిప్ చేసిన వీడియోని షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు లక్నో పోలీస్ కమిషనరేట్ తెలిపింది. 

ఈ వైరల్ వీడియోకి సంబంధించి లక్నో పోలీస్ కమిషనరేట్ ఇచ్చిన స్పష్టతను రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేసాయి.

చివరగా, క్లిప్ చేసిన వీడియోని లక్నో పాఠశాల నాటకంలో ‘భారత మాత’ వేషధారణలో ఉన్న బాలిక తలపై కిరీటాన్ని తీసి ఆమెతో నమాజ్ మాత్రమే చదివించిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll