“తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భార్య చేయించుకున్న వెండి బీరువా” అని చెప్తూ దుర్గా స్టాలిన్ ఒక వెండి బీరువా పక్కన నిలబడి ఫోటో దిగుతున్న వీడియో (ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఈ వీడియోలో కనిపిస్తున్న బీరువా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భార్య తయారు చేయించుకున్న వెండి బీరువా.
ఫ్యాక్ట్(నిజం): ఇందులో కనిపిస్తున్న బీరువా, తమిళనాడులోని సుక్రా జ్యువెలరీ వారు తయారు చేసిన వెండి బీరువా. 3.67 మీటర్ల ఈ బీరువాను ప్రపంచంలోనే అతిపెద్ద వెండి బీరువాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్లు గుర్తించారు. దీన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, 22 అక్టోబర్ 2024న ఆవిష్కరించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలను వెరిఫై చేయడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా ఈ వీడియో గురించి కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు లభించాయి.
ఈ కథనాల ప్రకారం ఈ వీడియోలో కనిపిస్తున్న వెండి బీరువాకి ఓనర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ కాదు. దీన్ని చెన్నైకి చెందిన సుక్రా జ్యువెలరీ వాళ్ళు తయారు చేశారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోను 24 అక్టోబర్ 2024న Vikatan E-magazine వాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో వివరణ బట్టి, సుక్రా జ్యువెలరీ వాళ్లు తయారు చేసిన ఈ బీరువాను దుర్గా స్టాలిన్ ఆవిష్కరించారు. ఈ బీరువా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ల గుర్తింపు కూడా పొందింది అని ఇందులో చెప్పారు.
దీని గురించి మరింత వెతుకగా, సుక్రా జ్యువెలరీ వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మాకు ఒక పోస్ట్ దొరికింది. ఇందులో దుర్గా స్టాలిన్ సుక్రా జ్యువెలరీ CEO నితిన్ కల్కిరాజుకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి సర్టిఫికెట్ ఇవ్వడం మనం చూడవచ్చు. ఈ కార్యక్రమం 22 అక్టోబర్ 2024న చెన్నైలోని మైలాపుర్‌లో ఉన్న సుక్రా జ్యువెలర్స్ వారి షోరూంలో జరిగింది.
ఇదే విషయం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి వెబ్సైటులో కూడా మాకు లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి బీరువా రికార్డు ఇండియాలో ఉన్న సుక్రా జ్యువెలరీ వారి పైన ఉంది అని. దీని పొడవు 3.67 మీటర్లు అని ఇందులో రాసి ఉంది.
చివరిగా, సుక్రా జ్యువెలరీ వారు తయారు చేసిన వెండి బీరువాని, తమిళనాడు ముఖ్యమంత్రి భార్య దుర్గా స్టాలిన్ ఆవిష్కరిస్తున్న వీడియోని, ఆ బీరువా తనకోసం దుర్గా స్టాలిన్ తయారు చేయించుకున్నారు అని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు.