తాలిబాన్ ఆక్రమణ తరువాత ఆఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులని చూసి అక్కడి ముస్లింలు శ్రీ రాముడి భజన చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తాలిబాన్ ఆక్రమణ తరువాత ఆఫ్ఘానిస్తానులో పరిస్థితులని చూసి అక్కడి ముస్లింలు శ్రీ రాముడి భజన చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో శ్రీరాముడి పాట భజన చేస్తున్నది బీహార్ రాష్ట్రానికి చెందిన ముఫ్తీ సదున్ నజీబ్ ఖాస్మి సాహబ్. 2019 నవంబర్ నెలలో బాబ్రీ మసీదుకి సంబంధించి నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ముఫ్తీ సదున్ నజీబ్ ఖాస్మి శ్రీ రాముడి గీతాన్ని ఆలపించాడు. బాబ్రీ మసీదు కోసం ఏళ్ల తరబడి పోరాటం చేసిన అక్షయ్ బ్రహ్మచారి చెప్పిన ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ముఫ్తీ సదున్ నజీబ్ ఖాస్మి ఈ పాటని పాడారు. ఈ వీడియో ఆఫ్ఘానిస్తాన్ దేశానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, ఈ వీడియోపై ‘BMM’ అనే వాటర్ మార్క్ కనపడుతుండటాన్ని మనం చూడవచ్చు. ఈ సమాచారం ఆధారంగా ఆ వీడియోకి మరింత సమాచారం కోసం వెతికితే, ‘Bgs Mushaira Media’ (BMM) అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని 15 ఫిబ్రవరి 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ముఫ్తీ సదున్ నజీబ్ సాహబ్ ఖాస్మి నూతన బయాన్ కార్యక్రమంలో శ్రీ రాముడి పాట ఆలపించిన దృశ్యాలని వీడియో వివరణలో తెలిపారు. ఈ వీడియోలోని 7:24 నిమిషాల దగ్గర సదున్ నజీబ్ సాహబ్ శ్రీరాముడి పాట పాడిన దృశ్యాలని మనం చూడవచ్చు.
ఈ వీడియోలోని 6:45 నిమిషాల దగ్గర ముఫ్తీ సదున్ నజీబ్ ఖాస్మి, బాబ్రీ మసీదు కోసం ఎన్నో తరాలు పోరాటం చేసిన చనిపోయిన అక్షయ్ బ్రహ్మచారి గురించి ప్రస్తావించారు. అక్షయ్ బ్రహ్మచారి ఒక సందర్భంలో, “మీరు మందిరం కోసం గొడవ పడుతున్నారు. శ్రీ రాముడి మందిరం కోసం బాబ్రీ మసీదుని కుల్చివేయాలని కోరుకుంటున్నారు. కాని, మీరు కొలుస్తున్న శ్రీ రాముడు, తన చిన్న తమ్ముడి కోసం రాజ్యాన్ని విడిచి వనవాసానికి వెళ్ళాడు. మీరు మీ ముస్లిం సోదరుల కోసం బాబ్రీ మసీదుని ఎందుకు త్యాగం చేయకూడదు. రామ మందిరం పేరుతో హింసని ఎందుకు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు?”, అని పేర్కొన్నారని తెలుపుతూ, ముఫ్తీ సదున్ నజీబ్ సాహబ్ ఇలా శ్రీ రాముడి గీతాన్ని ఆలపించాడు. ఈ పూర్తి వీడియోని మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా షేర్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పూర్తి వీడియోలో కేవలం రామ భజన చేస్తున్న భాగాన్ని మాత్రమే ఎడిట్ చేసి పోస్టులో షేర్ చేసిన వీడియోని రూపొందించారు.
ముఫ్తీ సదున్ నజీబ్ ఖాస్మి బిహార్ పుర్నియా జిల్లాకు చెందిన వాడని తెలిసింది. ఈ వీడియోకి సంబంధించిన మరింత స్పష్టత కోసం ‘ఆజ్ తక్’ ఫాక్ట్-చెకింగ్ టీం ముఫ్తీ సదున్ నజీబ్ ఖాస్మిని సంప్రదించింది. ముఫ్తీ సదున్ నజీబ్ ఖాస్మి ‘ఆజ్ తక్’ జర్నలిస్టులతో మాట్లాడుతూ, “ఈ వీడియో 30 నవంబర్ 2019 నాడు బీహార్ ఖగారియా జిల్లా ధాడి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించినది. మా కార్యక్రమాలలో సాధారణంగా ముస్లిం సమాజంతో పాటు హిందువులు కూడా పాల్గొంటారు. అందుకే, మా ఉపన్యాసాలలో ఇరు మతాలకి సందేశం ఉండే విధంగా ప్రయత్నిస్తాము. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము”, అని తెలిపారు. 2019 నవంబర్ నెలలో సుప్రీంకోర్టు, వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చిన తరువాత, బాబ్రీ మసీదు కోల్పోవడానికి కారణాలని వివరిస్తూ నజీబ్ ఖాస్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చివరగా, బీహార్‌కు చెందిన మౌలానా ఒక కార్యక్రమంలో రామ భజన పాడిన పాత వీడియోని ఆఫ్ఘానిస్తాన్ ముస్లింలు ఇటీవల రామ భజన చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.