Fake News, Telugu
 

ఒక సిములేషన్ వీడియోని ఇండోనేషియాలో జరిగిన నిజమైన విమాన ప్రమాదమని షేర్ చేస్తున్నారు

0

ఇండోనేషియాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విమాన ప్రమాద దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఇండోనేషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు భయంతో విమానం నుండి బయటకి వస్తున్న దృశ్యాలంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, రెండు వేరు వేరు వీడియోలని అతికించినట్టు స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్ద్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇండోనేషియాలో జరిగిన విమాన ప్రమాద దృశ్యాలు

ఫాక్ట్ (నిజం): వీడియోలోని మొదటి భాగంలో కనిపిస్తున్న విమాన ప్రమాద దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించింది కాదు. బాపిబిబున్ అనే యూట్యూబర్, ‘X-Plane 11’ అనే ఫ్లైట్ సిములేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఈ వీడియోని రూపొందించాడు. ఇలా అనేక వేరు వేరు దేశాల ఫ్లైట్ల క్రాష్ దృశ్యాలు తన యూట్యూబ్ ఛానల్ లో చూడొచ్చు. వీడియోలోని రెండవ భాగంలో కనిపిస్తున్న దృశ్యాలు, ఇటీవల కాస్పియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 730-400 విమానం మెయిన్ గేర్ కూలిపోయిన కారణంగా ఇరాన్ దేశంలో ఇస్ఫాహన్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఘటనకు సంబంధించినవి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన రెండు వీడియో క్లిప్పులకి సంబంధించిన వివరాలని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

వీడియో క్లిప్-1:

పోస్టులో షేర్ చేసిన మొదటి వీడియో క్లిప్ యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Bopbibun’ అనే యూట్యూబ్ ఛానల్ 02 మే 2020 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మద్యం మత్తులో ఉన్న ఒక పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న దృశ్యాలంటూ ఈ వీడియో టైటిల్‌లో తెలిపారు. అయితే, ఈ వీడియో ‘X-Plane 11’ అనే ఫ్లైట్ సిములేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి రూపొందించిందని, ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావని వివరణలో స్పష్టంగా తెలిపారు.

ఇలా అనేక వేరు వేరు దేశాల ఫ్లైట్ల క్రాష్ సిములేషన్ వీడియోలని బాపిబిబున్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో సిములేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి రూపొందించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.  

వీడియో క్లిప్-2:

పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Yeni Safak’ న్యూస్ ఛానల్ 07 జనవరి 2022 నాడు తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. కాస్పియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 730-400 విమానం, మెయిన్ గేర్ కూలిపోయిన కారణంగా ఇరాన్ దేశంలోని ఇస్ఫాహన్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన దృశ్యాలంటూ ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ విమానంలో ఉన్న 110 ప్రయనికులని వెంటనే విమానం నుండి బయటకి తరలించారని, వీరిలో అయిదుగురికి స్వల్ప గాయలైనట్టు ఈ పోస్టులో తెలిపారు.

ఈ ప్రమాద ఘటన 05 జనవరి 2022 నాడు చోటుచేసుకున్నట్టు తెలిసింది.  కాస్పియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 730-400 విమానం ఇస్ఫాహన్ విమానాశ్రయం రన్‌వే పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్పులో కనిపిస్తున్నవి ఇటీవల ఇరాన్ దేశంలో చోటుచేసుకున్న విమాన ప్రమాద ఘటన దృశ్యాలని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సిములేషన్ వీడియోని, ఇరాన్ దేశంలో ఇటీవల చోటుచేసుకున్న విమాన ప్రమాద దృశ్యాలను జత చేస్తూ రూపొందించిన వీడియోని ఇండోనేషియాలో విమాన ప్రమాద దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll