Fake News, Telugu
 

మోదీ ప్రభుత్వం పబ్లిసిటీ పై రూ. 43,000 కోట్లు ఖర్చు చేసిందన్న వాదనలో నిజం లేదు

0

మోదీ ప్రభుత్వం యొక్క పబ్లిసిటీ ఖర్చు 43 వేల కోట్లని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మోదీ ప్రభుత్వం యొక్క పబ్లిసిటీ ఖర్చు 43 వేల కోట్లు.

ఫాక్ట్ (నిజం): డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ & విజువల్ పబ్లిసిటీ (DAVP) అందించిన సమాచారం ప్రకారం 2002-03 నుండి 2017-18 వరకు 16 సంవత్సరాలలో సుమారు రూ. 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పబ్లిసిటీ పైన ఖర్చు చేసింది. ఇందులో మోదీ మొదటి సారి ప్రధానమంత్రి అయిన 2014 నుండి పరిశీలిస్తే 2014-15 నుండి 2017-18 వరకు పబ్లిసిటీ పై సుమారు రూ. 4,800 కోట్లు ఖర్చు చేసింది, అంటే సగటున సంవత్సరానికి సుమారు రూ.1,200 కోట్లు పబ్లిసిటీ పైన ఖర్చు చేసింది. ఈ వివరాల ఆధారంగా లెక్కిస్తే మోదీ మొదటి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అయిన పబ్లిసిటీ ఖర్చు పోస్టులో పెర్కొనంత ఎక్కువగా ఉండదని అర్ధం చేసుకోవచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

భారత ప్రభుత్వం యొక్క వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలకు సంబంధించిన మీడియా ప్రకటనలు, ప్రచారానికి సంబంధించిన వ్యవహారాలు కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ & విజువల్ పబ్లిసిటీ (DAVP) చూసుకుంటుంది.

  • ప్రెస్ అడ్వర్టైజ్మెంట్స్
  • బహిరంగ ప్రచారం – హోర్డింగ్‌లు, కియోస్క్‌లు, బస్ ప్యానెల్లు, వాల్ పెయింటింగ్‌లు, సినిమా స్లైడ్‌లు, బ్యానర్లు మొదలైన వాటి ప్రదర్శన.
  • ప్రింట్ పబ్లిసిటీ – బుక్‌లెట్లు, ఫోల్డర్‌లు, పోస్టర్లు, కరపత్రాలు, క్యాలెండర్లు, డైరీలు మొదలైనవి.
  • ఆడియో & విజువల్ పబ్లిసిటీ – స్పాట్స్ / క్వికీస్, జింగిల్స్, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్, షార్ట్ ఫిల్మ్స్ మొదలైనవి.
  • బల్క్ ఎస్ఎంఎస్, వెబ్‌సైట్ మరియు ఇతర వర్ధమాన మీడియా ద్వారా డిజిటల్ మీడియా ప్రచారం

ఐతే FACTLY కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు మొదలైన అంశాల ప్రచారానికి అయిన ఖర్చులకు  సంబంధించిన  సమాచారం RTI ద్వారా DAVP నుండి పొందింది. ఈ సమాచారం ప్రకారం 2002-03 నుండి 2017-18 వరకు 16 సంవత్సరాలలో సుమారు రూ. 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పబ్లిసిటీ పైన ఖర్చు చేసింది.

ఐతే మోదీ మొదటి సారి ప్రధానమంత్రి అయిన 2014 నుండి పరిశీలిస్తే 2014-15 నుండి 2017-18 వరకు ప్రభుత్వం పబ్లిసిటీ పై సుమారు రూ. 4,800 కోట్లు ఖర్చు చేసింది, అంటే సగటున సంవత్సరానికి సుమారు రూ.1,200 కోట్లు పబ్లిసిటీ పైన ఖర్చు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ ఖర్చు కి సంబంధించి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ సంబంధించిన మంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం 2018-19 సంవత్సరానికి గాను 28 జనవరి 2019 వరకు కేంద్ర ప్రభుత్వం పబ్లిసిటీ పైన రూ. 676.46 కోట్లు ఖర్చు చేసింది. 

ప్రభుత్వం 2017-18 నుండి 2019-20 వరకు వివిధ రాష్ట్రాలలో ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిసిటీకి సంబంధించి కమిట్ అయిన ఖర్చుల వివరాలు, మరియు ఏ సంస్థకి ఎంత కమిట్ అయిన వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. అలాగే 2020-21లో ప్రింట్ మరియు టెలివిషన్ మీడియా ద్వారా పబ్లిసిటీ పై ఖర్చు చేసిన వివరాలు ఇక్కడ చూడొచ్చు. 2018-19 నుండి 2020-21 వరకు పబ్లిసిటీ పై అయిన ఖర్చుల వివరాలు తెలియనప్పటికీ, ఆ మూడు సంవత్సరాలలో అయిన ఖర్చులు కలుపుకొని మొత్తం మోదీ హాయాంలో అయిన ఖర్చు మాత్రం పోస్టులో చెప్పినంత భారీగా (రూ. 43,000 కోట్లు) ఉండదని పైన తెలిపిన సమాచారం బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే 2002-03 నుండి 2017-18 వరకు 16 సంవత్సరాలలో అయిన ఖర్చే రూ. 10,000 కోట్లు దాటలేదు.

ప్రభుత్వాల పబ్లిసిటీ ఖర్చులకు సంబంధించి FACTLY ఇంతకు ముందు వివరంగా రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, మోదీ ప్రభుత్వం పబ్లిసిటీ పై  రూ. 43,000 కోట్లు ఖర్చు చేసిందన్న వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll