సౌదీ అరేబియా ప్రభుత్వం భారతీయ ఇతిహాసాలలో ప్రముఖమైన భగవద్గీత పుస్తకాన్ని అరబిక్ భాషలో అనువదించి ఇటీవల విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: సౌదీ అరేబియా ప్రభుత్వం భగవద్గీత పుస్తకాన్ని అరబిక్ భాషలో అనువదించి ఇటీవల విడుదల చేసింది.
ఫాక్ట్ (నిజం): అరబిక్ భాషలో రచించిన ఫోటోలోని భగవద్గీత పుస్తకాన్ని ఇస్కాన్ కు చెందిన హెచ్.జి. రవనారి ప్రభు అనే భక్తుడు రచించాడు. అబూ ధాబీకి చెందిన కలిమా ఫౌండేషన్ కూడా భగవద్గీతని అరబిక్ భాషలో అనువదించి ఆ పుస్తకాన్ని 2009లో జరిగిన అబూ ధాబీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ADIBF) లో ప్రదర్శనకు పెట్టింది. కాని, ఈ అనువాదాలతో సౌదీ అరేబియా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం ‘Saudi government released Bhagavad Gita Arabic version’ అనే కీ పదాలు ఉపయోగించి గూగుల్ లో వెతికితే, సౌదీ అరేబియా ప్రభుత్వం భగవద్గీతని అరబిక్ భాషలోకి అనువదించి పుస్తకం విడుదల చేసినట్టు ఎటువంటి న్యూస్ రిపోర్ట్ పబ్లిష్ అవలేదని తెలిసింది. ఒకవేళ సౌదీ అరేబియా ప్రభుత్వం అరబిక్ భాషలో భగవద్గీతని విడుదల చేసి ఉంటే, ఆ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యేవి. భగవద్గీత పుస్తకాన్ని అరబిక్ భాషలో విడుదల చేస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రెస్ ఏజెన్సీ ఎక్కడ ప్రకటించలేదు.
పోస్టులో షేర్ చేసిన భగవద్గీత పుస్తకం ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఇదే పుస్తకం ఫోటోని షేర్ చేస్తూ ‘Isvara.org’ వెబ్సైటులో ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అరబిక్ భాషలో ఉన్న ఫోటోలోని భగవద్గీత పుస్తకాన్ని, ఇస్కాన్ కు చెందిన హెచ్.జి. రవనారి ప్రభు అనే భక్తుడు రచించినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. పాలస్తీనాకు చెందిన రవనారి ప్రభు, భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపద కోరిక మేరకు భగవద్గీతని అరబిక్ భాషలో అనువదించినట్టు తెలిసింది. ఈ పుస్తకంతో సౌదీ అరేబియా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు.
అబూ ధాబీ కి చెందిన కలిమా ఫౌండేషన్ కూడా భారతీయ ఇతిహాసాలని అరబిక్ భాషలో అనువదించి 2009లో జరిగిన అబూ ధాబీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ADIBF) లో ప్రదర్శించినట్టు ‘Gulf News’ న్యూస్ సంస్థ ఒక ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది. 2009లో కలిమా ఫౌండేషన్ ప్రచురించిన అరబిక్ భగవద్గీత పుస్తకాన్ని ఇక్కడ చూడవచ్చు. దామోదర్ ఠాకూర్ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని అనువదించినట్టు తెలిసింది. ఈ పుస్తకంతో కూడా సౌదీ అరేబియా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు.
చివరగా, సౌదీ అరేబియా ప్రభుత్వం భగవద్గీతని అరబిక్ భాషలోకి అనువదించి పుస్తకం విడుదల చేయలేదు.