Fake News, Telugu
 

నరేంద్ర మోదీని పొగుడుతూ ప్రసంగం ఇస్తున్న వీడియోలో వ్యక్తి పాకిస్తాన్ విలేకరి కాదు

0

పాకిస్తాన్ విలేకరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి పొగుడుతూ ప్రసంగం ఇస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పాకిస్తాన్ విలేకరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి పొగుడుతూ ప్రసంగం ఇస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో నరేంద్ర మోదీని పొగుడుతూ ప్రసంగం ఇస్తున్నది భారత దేశానికి చెందిన మొటివేషనల్ స్పీకర్, హర్షవర్ధన్ జైన్. హర్షవర్ధన్ జైన్ ఈ వీడియోని 15 ఆగష్టు 2020 నాడు తన యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసారు. హర్షవర్ధన్ జైన్ పాకిస్తాన్ విలేకరి కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని కొందరు యూసర్లు తమ ఫేస్బుక్ పేజిలో షేర్ చేసినట్టు తెలిసింది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. వీడియోలో ప్రసంగం ఇస్తుంది హర్షవర్ధన్ జైన్ అనే మొటివేషనల్ స్పీకర్ అని ఈ పోస్టులలో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా వీడియోలో ప్రసంగం ఇస్తున్న వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాల కోసం వెతకగా, ఇదే వీడియోని హర్షవర్ధన్ జైన్ అనే యూట్యూబ్ ఛానెల్ 15 ఆగష్టు 2020 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలోని 1:41 నిమిషాల నుంచి పోస్టులో షేర్ చేసిన అవే దృశ్యాలు కనపడుతుండటాన్ని మనం గమనించవచ్చు. హర్షవర్ధన్ భారత దేశానికి చెందిన ఒక ప్రముఖ మొటివేషనల్ స్పీకర్ అని ఈ యూట్యూబ్ ఛానల్ వివరణలో తెలిపారు. హర్షవర్ధన్ జైన్ పలు సమావేశంలో ఇచ్చిన ప్రసంగాల వీడియోలని అతని ప్రైవేటు వెబ్సైటులో మరియు సోషల్ మీడియా హేండిల్స్ లో షేర్ చేసారు. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

‘India Today’ న్యూస్ సంస్థ ఈ వీడియోకి సంబంధించి స్పష్టత కోసం హర్షవర్ధన్ జైన్ ఆఫీస్ ని సంప్రదించగా, హర్షవర్ధన్ జైన్ అసిస్టెంట్ త్రిలోక్ శర్మ ఈ వీడియోపై వారికి స్పష్టతనిచ్చారు. హర్షవర్ధన్ జైన్ రాజస్తాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరానికి చెందిన వారని, అతను ఒక కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులకు ప్రసంగం ఇస్తున్నప్పుడు ఈ వీడియో తీసినట్టు త్రిలోక్ శర్మ ‘India Today’ కి తెలిపారు. హర్షవర్ధన్ జైన్ పాకిస్తాన్ కి చెందిన వారు కాదని అతను స్పష్టం చేసారు. ‘India Today’ హర్షవర్ధన్ జైన్ ఆఫీస్ వారు ఇచ్చిన స్పష్టతను రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.  ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలోని వ్యక్తి పాకిస్తాన్ విలేకరి కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈ వీడియోలో నరేంద్ర మోదీని పొగుడుతూ ప్రసంగం ఇస్తుంది భారత దేశానికి చెందిన మొటివేషనల్ స్పీకర్, హర్షవర్ధన్ జైన్, పాకిస్తాన్ విలేకరి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll