సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును అవినీతి మరియు అధికార దుర్వినియోగం ఆరోపణలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొద్దీ రోజుల క్రితం సస్పెండ్ చేసింది. అయితే, చంద్రబాబు ఒత్తిడి వల్లనే తాను గతంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశానని ఏబీ వెంకటేశ్వరరావు (ఐపీఎస్) తెలిపినట్లుగా ఉన్న ‘పత్రికా ప్రకటన’ ఒకటి సోషల్ మీడియా లో చలామణి అవుతోంది. ఆ లేఖ విశ్వసనీయతను పరిశీలిద్దాం.
క్లెయిమ్: ఒత్తిడి వల్లనే తాను గతంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశానని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ‘పత్రికా ప్రకటన’ లో తెలిపారు.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని ‘పత్రికా ప్రకటన’ లేఖ నఖిలీది. వాస్తవ లేఖలో వెంకటేశ్వరరావు, ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడానికి గల కారణాల గురించి మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, ప్రభుత్వ చర్యను చట్ట పరంగా ఎదురుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తాననీ తెలిపారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ని అవినీతి మరియు అధికార దుర్వినియోగం ఆరోపణలతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ‘News 18 Telugu’ కథనం ద్వారా తెలుస్తుంది. అదే కథనంలో ప్రభుత్వ చర్యపై స్పందిస్తూ, వెంకటేశ్వరరావు రాసిన లేఖ కూడా ఉంది. ఆ ‘పత్రికా ప్రకటన’ లేఖ ఈ విధంగా ఉంది– ‘రాష్ట్ర ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కబురు మీ వరకూ చేరే ఉంటుంది. మీడియా లో వస్తున్న కధానాలలో వాస్తవం లేదని మీ అందరికీ తెలియజెప్పడం ఈ ప్రకటన ఉద్దేశం. దీనివల్ల మానసికంగా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మీరెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్ట పరంగా నాకున్న అవకాశాలను పరిశీలిస్తున్నాను. తదుపరి ఏమిటనేది క్రమంగా మీకే తెలుస్తుంది’. అదే లేఖను ‘Samayam’ వార్తా కథనం లో కూడా చూడవచ్చు.
చివరిగా, చంద్రబాబు ఒత్తిడి వల్లనే తాను గతంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశానని ఏబీ వెంకటేశ్వరరావు (ఐపీఎస్) తెలిపినట్లుగా ఉన్న ‘పత్రికా ప్రకటన’ నఖిలీది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?