పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రసంగం ఇస్తుంటే ఒక మహిళ, విప్లవ్ ఠాకూర్, మోదీని ఆపి కడిగిపారేసింది అని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో ఫేస్బుక్ లో విస్తృతంగా ప్రచారం కబడుతుంది. ఆ పోస్ట్ యొక్క క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: పార్లమెంట్ లో ఒక మహిళ, విప్లోవ్ ఠాకూర్, నరేంద్ర మోదీ ప్రసంగిస్తుంటే ఆపి కడిగిపారేసిన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఆ వీడియో లో విప్లవ్ ఠాకూర్ మోదీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు తనకు అడ్డు చెబుతున్న BJP వాళ్ళని నిశ్శబ్దంగా కూర్చోమన్నది. తాను ఉద్దేశించింది మోదీని కాదు. అసలు విప్లవ్ ఠాకూర్ ప్రసంగించేటప్పుడు మోదీ ఆ సభలోనే లేడు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే లాగా ఉంది.
పోస్ట్ చేసిన వీడియో లో విప్లవ్ ఠాకూర్ విజువల్స్ రాజ్య సభలో ఉంటే, నరేంద్ర మోదీ విజువల్స్ మాత్రం లోక్ సభ లో ఉండడం గమనించవచ్చు. ఇంతకు విప్లవ్ ఠాకూర్ రాజ్య సభ లో ప్రసంగిస్తున్నప్పుడు మోది రాజ్య సభ లోనే ఉన్నాడా లేదా అనేది చూద్దాం.
విప్లవ్ ఠాకూర్ ఆ రోజు రాజ్య సభలో 2:36pm కి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ మీద తన ప్రసంగాన్ని మొదలు పెట్టింది. ఆ ప్రసంగానికి సంబంధించిన పూర్తి వీడియోని రాజ్య సభకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లోనూ మరియు ఆ ప్రసంగం యొక్క ప్రతిని రాజ్యసభ వెబ్సైటు లో చూడవచ్చు. అంతేకాక, ఆమె ప్రసంగించేటప్పుడు మోదీ రాజ్య సభలో లేడు, ఎందుకంటే ఆ సభ లో మోడీ కూర్చునే సీట్ ఖాళీగా కనిపించింది (రాజ్య సభ యొక్క సీటింగ్ అరేంజ్ మెంట్ ప్రకారం, ఎప్పుడైనా సభాపతి కి కుడి వైపు ఉన్న మొదటి సీట్ సభా నాయకుడికి మరియు రెండవ సీట్ ప్రధాన మంత్రికి కేటాయించబడి ఉంటుంది).
రాజ్య సభ కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లో ఇతర వీడియోలని గమనిస్తే మోదీ సాయంత్రం 5:11 కి, రాందాస్ అతావలె ప్రసంగిస్తున్నప్పుడు, రాజ్య సభకి వచ్చి 5:14 కి తన ప్రసంగం మొదలు పెట్టాడని తెలుస్తుంది.
చివరగా, పార్లమెంట్ లో మోదీ ప్రసంగిస్తుంటే విప్లవ్ ఠాకూర్ ఆపి కడిగిపారేసింది అని తప్పు ప్రచారం చేస్తున్నారు. అసలు విప్లవ్ ఠాకూర్ ప్రసంగించేటప్పుడు మోదీ రాజ్యసభలోనే లేడు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?