Fake News, Telugu
 

ఆయుష్మాన్ హెల్త్ కార్డు ద్వారా ప్రభుత్వం ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదా నగదు ప్రయోజనాలు అందించట్లేదు

0

ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ద్వారా ఉచితంగా 5 లక్షల రూపాయల బెనిఫిట్స్ పొందొచ్చని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. పోస్టులో ఈ హెల్త్ కార్డ్ అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా అందించారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ద్వారా ఉచితంగా 5 లక్షల రూపాయల బెనిఫిట్స్ పొందొచ్చు.

ఫాక్ట్ (నిజం): 27 సెప్టెంబర్ 2021న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా పౌరులకు ఒక హెల్త్ ఐడిని జనరేట్ చేసుకొని అవకాశం కల్పించింది. ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగు పరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ హెల్త్ ఐడిని ఎవరైనా పొందవచ్చు. ఐతే ప్రభుత్వం ఈ హెల్త్ ఐడి ద్వారా ఎటువంటి ఆర్ధిక ప్రయోజనాలు అందించట్లేదు. ఇంతకు ముందే ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తుంది, ఐతే దీనికి అందరు అర్హులుకారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మరియు పట్టణ ప్రాంత పౌరులకు వేరువేరుగా అర్హతలు రూపొందించింది, కేవలం ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్నవారే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM):

27 సెప్టెంబర్ 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (NDHM) ప్రారంభించారు, దీనినే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) అని కూడా అంటారు. ఇందులో భాగంగా పౌరుల సమగ్ర ఆరోగ్య సమాచారం పొందపరచే విధంగా అందరికి ఒక నేషనల్ హెల్త్ ఐడి అందించనుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగం కావాలనుకునేవారు ఈ హెల్త్ ఐడిని పొందవచ్చు.

పౌరులు తమ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ రికార్డ్స్ ఈ ఐడి ద్వారా ఆన్లైన్‌లో పొందపరచవచ్చు. ఇలా చేయడం ద్వారా పౌరులు ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం పొందవచ్చు. అదేవిధంగా ఆరోగ్య సేవలందించే సంస్థలు ఈ డేటా ద్వారా పౌరులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించవచ్చు, ప్రభుత్వాలు కూడా ఈ సమాచారం ఆధారంగా మెరుగైన చట్టాలు రూపొందించొచ్చు అనే ఉద్దేశంతో ఈ మిషన్‌ని ప్రారంభించారు.

ఈ డిజిటల్ హెల్త్  ఐడిని ఎవరైనా పొందవచ్చు. అలాగే పౌరులు తమ డేటాని గోప్యంగా ఉంచే అవకాశం కూడా ఉంది. ఐతే పోస్టులో చెప్తునట్టు ఈ ఐడి ద్వారా 5 లక్షల రూపాయల బెనిఫిట్స్ పొందవచన్నది నిజం కాదు, ఈ ఐడి ద్వారా ప్రత్యేకంగా ఎటువంటి నగదు ప్రయోజనాలు లేవు.

ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన:

కేంద్ర ప్రభుత్వం 2018లోనే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీనినే ఇప్పుడు ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అని అంటున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పౌరులకు 5 లక్షల రూపాయల వరకు భీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఐతే ఈ పథకం అందరికీ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పథకం అమలుకు సంబంధించి కొన్ని అర్హతలను సూచించింది, కేవలం ఈ అర్హతలకు లోబడి ఉన్నవారే ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు.

ఐతే పోస్టులో తెలిపిన హెల్త్ కార్డుకి, ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సురన్సుకి ఎటువంటి సంబంధంలేదు. ఈ డిజిటల్ హెల్త్ కార్డు లేనివారు కూడా  ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

చివరగా, ఆయుష్మాన్ హెల్త్ కార్డు ద్వారా ప్రభుత్వం ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదా నగదు ప్రయోజనాలు అందించట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll