Fake News, Telugu
 

భారత దేశ జనాభాలో 19.6% ఉన్న దక్షిణాది రాష్ట్రాల డిసెంబర్ నెల జీఎస్‌టీ పన్ను వసూళ్ల వాటా 25.3%

0

భారత దేశ జనాభాలో 20% ఉన్న దక్షిణాది రాష్ట్రాలు, పన్ను వసూళ్లలో మాత్రం 17% ఉన్నదని డిసెంబర్ 2021లో జీఎస్‌టీ వసూళ్లు చూపిస్తూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. తమ వాదనకు మద్దతుగా డిసెంబర్ 2021లో జీఎస్‌టీ వసూళ్ల లెక్కలు చూపిస్తూ పోస్టును షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత దేశ జనాభాలో 20% ఉన్న దక్షిణాది రాష్ట్రాలు, జీఎస్‌టీ పన్ను వసూళ్ల వాటాలో మాత్రం 17%.

ఫాక్ట్: డిసెంబర్ 2021కు దక్షిణాది రాష్ట్రాల (కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ) మొత్తం జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ (ఇంపోర్టెడ్ గూడ్స్ పైన జీఎస్టీ కలపకుండా) 25.3%. కానీ, దక్షిణాది రాష్ట్రాల మొత్తం జనాభా భారతదేశ జనాభాలో 19.6%. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

అన్ని రాష్ట్రాల జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ యొక్క డేటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. డిసెంబర్ 2021కు దక్షిణాది రాష్ట్రాల (కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ) మొత్తం జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ (ఇంపోర్టెడ్ గూడ్స్ పైన జీఎస్‌టీ కలపకుండా) 25.3%. అయితే దక్షిణాది రాష్ట్రాల మొత్తం జనాభా 19.6%. జనాభా డేటా 2021 సంవత్సరానికి ఉన్న జనాభా ప్రొజెక్షన్ రిపోర్ట్ 2011-2036 నుండి తీసుకోబడింది. ఇంపోర్టెడ్ గూడ్స్ పైన వేసే జీఎస్‌టీ ఒక రాష్ట్రం నుండి అని ప్రత్యేకంగా ఉండదు. అది కాకుండా మిగతా జీఎస్‌టీ వసూళ్ళలో రాష్ట్రాల వాటాని (కాంట్రిబ్యూషన్) ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.

కర్ణాటక జనాభా దేశ జనాభాలో 4.76% ఉండగా, జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ మాత్రం 9.10% ఉంది. తమిళనాడు జనాభా దేశ జనాభాలో 5.61% ఉండగా, జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ మాత్రం 7.24% ఉంది. తెలంగాణ జనాభా దేశ జనాభాలో 2.77% ఉండగా, జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ మాత్రం 4.10% ఉంది. ఆంధ్రప్రదేశ్, కేరళలో మాత్రం ఇందుకు భిన్నంగా జనాభా శాతం ఎక్కువ ఉంది, జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ జనాభా దేశ జనాభాలో 3.87% ఉండగా, జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ మాత్రం 2.76% ఉంది. కేరళ జనాభా దేశ జనాభాలో 2.60% ఉండగా, జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ మాత్రం 2.07% ఉంది.    

అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి కొన్ని ఉత్తర రాష్ట్రాల జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ వాటి జనాభాతో పోలిస్తే, దక్షిణాది రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు మరియు కొన్ని ఉత్తర రాష్ట్రాల జనాభా, మరియు వారి జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ కింద చూడవచ్చు. ఉత్తరప్రదేశ్ జనాభా దేశ జనాభాలో 16.94% ఉండగా, జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ మాత్రం 6.58% ఉంది. మధ్యప్రదేశ్ జనాభా దేశ జనాభాలో 6.20% ఉండగా, జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ మాత్రం 2.76% ఉంది. బీహార్ జనాభా దేశ జనాభాలో 9.03% ఉండగా, జీఎస్‌టీ కాంట్రిబ్యూషన్ మాత్రం 1.05% ఉంది.    

గత ఆరు నెలలుగా కూడా, ట్రెండ్ సుమారు ఇదే విధంగా ఉన్నట్టు కింద డేటా చార్ట్ ద్వారా చూడొచ్చు.

చివరగా, భారత దేశ జనాభాలో 19.6% జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు, డిసెంబర్ 2021లో జీఎస్‌టీ పన్ను వసూళ్ల వాటాలో 25.3% ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll