“ఒక పురుషుడు బురఖా వేసుకుని దాని కింద శరీరమంతా RDX పెట్టుకొని మానవ బాంబుగా మారాడు అంటూ” వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోను భారతదేశానికి ఆపాదిస్తూ షేర్ చేస్తూ ఇందుకోసమే భారతదేశంలో బురఖాను నిషేధించాలి అని పేర్కొంటున్నారు. ఈ వీడియోలో బురఖా ధరించిన వ్యక్తిని పోలీసు దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఆపి విచారించడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశంలో ఒక పురుషుడు బురఖా వేసుకుని దాని కింద శరీరమంతా RDX పెట్టుకొని మానవ బాంబుగా మారిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదు. ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌లో బురఖా కింద మాదక ద్రవ్యాలను దాచిపెట్టి ఓ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తున్న ఘటనను చూపిస్తుంది. పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థల కథనాల ప్రకారం, ఈ ఘటన 9 మార్చి 2021న రౌజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు మాదకద్రవ్యాల/డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని, రహస్య సమాచారం అందుకున్న రౌజన్ పోలీసులు చిట్టగాంగ్-రంగమతి రోడ్‌లోని జలీల్ నగర్ ప్రాంతంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన సాగర్ బురఖా ధరించి గర్భిణి వేషధారణలో మద్యం అక్రమ రవాణా చేస్తున్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలతో కూడిన న్యూస్ రిపోర్ట్ వీడియో ఒకటి లభించింది. ఈ న్యూస్ రిపోర్ట్ వీడియోను ‘Smile Tv Bangla’ అనే బంగ్లాదేశ్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్ 11 మార్చి 2021న షేర్ చేసింది. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు చిట్టగాంగ్‌లోని రౌజాన్‌లో గర్భిణీ స్త్రీ ముసుగులో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకుని జైలుకు పంపిన ఘటనకు సంబంధించినది. రౌజన్ అనేది బంగ్లాదేశ్‌లో ఒక ప్రాంతం.
తదుపరి ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ ఘటనను రిపోర్ట్ చేస్తూ పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు పబ్లిష్ చేసిన వార్త కథనాలు లభించాయి (ఇక్కడ , & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ ఘటన 9 మార్చి 2021న రౌజన్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు మాదకద్రవ్యాల/డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని, రహస్య సమాచారం అందుకున్న రౌజన్ పోలీసులు చిట్టగాంగ్-రంగమతి రోడ్‌లోని జలీల్ నగర్ ప్రాంతంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి సాగర్ (20), అమీనా బేగం (19)లను అరెస్టు చేశారు. కాగా, వారి నుంచి 52 లీటర్ల పహారీ చోలై మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న సాగర్, అమీనా బేగం డబ్బుకు బదులుగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల్లో ఒకరైన సాగర్ బురఖా ధరించి గర్భిణి ముసుగులో మాదక ద్రవ్యాలను/ మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి వైరల్ వీడియోలోని దృశ్యాలు బంగ్లాదేశ్‌లోని రౌజాన్‌లో గర్భిణీ ముసుగులో మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన ఘటనకు సంబంధించినవి అని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, బంగ్లాదేశ్‌లో బురఖా కింద మాదక ద్రవ్యాలను దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి వీడియోను భారతదేశానికి ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.