05 జనవరి 2024 నుండి ఓవర్ లోడ్ వాహనాలకు జరిమానా విధించనున్నారన్న ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 113/194(1) కింద ఈ జరిమానాలు విధించనున్నారని చెప్తూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ పేరుతో ఈ ప్రకటన షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: 05 జనవరి 2024 నుండి ఓవర్ లోడ్ వాహనాలకు రూ. 20,000 జరిమానా విధించనున్నారు.
ఫాక్ట్(నిజం): ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనాలకు జరిమానా విధించే నిబంధన ముందు నుండే అమలులో ఉంది, ఇదేం ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న నిబంధన కాదు. దేశవ్యాప్తంగా ఈ నిబంధన కింద జరిమానాలు విధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా 05 జనవరి 2024 నుండి ఈ నిబంధనను అమలు చేయబోతున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇటీవల భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సమ్మె విరమించుకుంది. ఈ నేపథ్యంలోనే 05 జనవరి 2024 నుండి ఓవర్ లోడ్ వాహనాలకు జరిమానా విధించనున్నారు అంటూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ పేరుతో ఒక ప్రకటన షేర్ అవుతోంది.
ఐతే ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనాలకు ఇప్పుడు కొత్తగా జరిమానాలు విధించట్లేదు. ముందునుండే ఈ నిబంధన అమలులో ఉంది. మోటారు వాహన చట్టం, 1988 ప్రకారం ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనానికి కనీసం 2,000 రూపాయల జరిమానా, పరిమితికి మించి ఉన్న బరువులోని ఒక్కో టాన్నుకి 1000 రూపాయిల జరిమానా విధించవచ్చని ఉంది. ఒకవేళ ఓవర్ లోడ్ వాహనాన్ని డ్రైవర్ నడిపినా కూడా, యజమానికి ఆదేశాల మేరకు ఇది జరిగిందని కోర్టు భావించవచ్చని కూడా ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.
2019లో ఈ చట్టానికి చేసిన సవరణలో కూడా ఈ నిబంధనను కొనసాగించారు, కానీ జరిమానాలో మార్పులు చేసారు. సవరించిన జరిమానాల ప్రకారం ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనానికి కనీసం 20,000 రూపాయల జరిమానా, పరిమితికి మించి ఉన్న బరువులోని ఒక్కో టాన్నుకి 2000 రూపాయిల జరిమానా విధించనున్నారు. కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తకు విరుద్దంగా ఇదేం ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న నిబంధన కాదు, ముందు నుండే ఈ నిబంధన అమలులో ఉంది.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని 21 అక్టోబర్ 2020 నాడు ఆమోదిస్తూ జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఒకవేళ డ్రైవర్ వాహనం బరువు చెకింగ్‌కు కోసం ఆపకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తే, ఆ వాహనంపై 40,000 రూపాయిల జరిమాన విధించవచ్చు (ఇక్కడ మరియు ఇక్కడ).
దేశవ్యాప్తంగా కూడా ఈ నిబంధన అమలులో ఉంది. ఢిల్లీలో ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనానికి 2 లక్షలపై చిలుకు జరిమానా విధించిన ఘటనకు సంబంధించిన రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు. అధిక బరువుతో వాహనం నడిపిన నేరానికి వాహన యజమానులు కూడా బాధ్యులు అని కేరళ హైకోర్టు తీర్పు చెప్పిన ఉదాహరణ ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనాలకు జరిమానా విధించే నిబంధన ముందు నుండే అమలులో ఉంది.