Fake News, Telugu
 

2017లో రైలు ఇంజన్ నీళ్లు లీక్ అయిన సంఘటన ఇటీవల వందే భారత్ రైలులో జరిగిన సంఘటన అని షేర్ చేస్తున్నారు

0

‘మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వాన పడకుండా గొడుగు వేసుకొని రైలు నడుపుతున్న లోకో పైలట్’ అని చెప్తూ రెండు ఫోటోల కొల్లాజ్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని ఒక ఫొటోలో రైలు డ్రైవర్ గొడుగు పట్టుకొని ఉండటాన్ని మనం గమనించవచ్చు. అసలు ఈ పోస్టులో క్లెయిమ్‌లో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: వందే భారత్ రైలులో లీక్ అయ్యిన వాన నీరు. తడవకుండా ఉండటానికి గొడుగు పట్టుకొని కూర్చున్న లోకో పైలట్. 

ఫాక్ట్(నిజం): ఫొటోలోని సంఘటన 2017లో జార్ఖండ్లో జరిగింది, రైల్వే మంత్రిత్వ శాఖ వారు ఈ సంఘటనపై వివరణ ఇస్తూ, ఇది ఒక డెడ్ (పని చెయ్యని) లోకోమోటివ్ అని, దాన్ని ముందునుండి వేరే ఇంజిన్ లాగటాన్ని వీడియోలో చూడవచ్చు అని చెప్పారు. భారత దేశంలో మొదటి వందే భారత్ రైలు 2019లో ప్రారంభింపబడింది. ఇదిలా ఉండగా, ఇటీవల ప్రధాని మోదీ కేరళలో ప్రారంభించిన వందే భారత్ రైల్లో లీకేజీ సమస్య వచ్చింది. కానీ డ్రైవర్ గొడుగు పట్టుకొని రైలు నడుపుతున్నట్లు ఎటువంటి వార్త కథనాలు రాలేదు. కావున పోస్టులో చెప్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

పోస్టులోని ఫోటో కొలాజ్‌లో ఉన్న రెండు ఫోటోలను క్రాప్ చేసి విడివిడిగా గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ రెండు వేరు వేరు రైలు సమస్యలకు సంబంధించిన సంఘటనలవి అని తెలిసింది.

మొదటిగా కుడి ప్రక్క ఉన్న ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా,  2017లో ప్రచురితమైన ఇండియా టైమ్స్ వారి వార్త కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఈ సంఘటనకు చెందిన వీడియో ఒకటి జర్నలిస్ట్ సుచేత దలాల్ ట్వీట్ చేసారు, అందులో నీరు ఇంజిన్ పైకప్పులోనుండి కిందకి లీక్ అవటాన్ని మనం చూడవచ్చు.

ఈ సంఘటనను గురించి మరింత సమాచారం కోసం తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ వారి వార్త కథనం లభించింది. దాన్ని బట్టి, రైలు జార్ఖండ్లోని బెర్మో స్టేషన్ ద్వారా వెళ్తుండగా ఈ వీడియోను చిత్రించారు. ఇదే సంఘటనపై వివరణ ఇస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది, దీనిపై ఎంక్వయిరీ చేసి, ఈ ఇంజిన్ ఒక డెడ్ ఇంజిన్ అని, దీన్ని ముందు వైపునుండి వేరే ఇంజిన్ లాగటాన్ని మనం వీడియోలో గమనించవచ్చు అని ట్వీట్ ద్వారా తెలియపరిచారు.

ఇదిలా ఉంచితే ఈ రైలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ అయ్యే అవకాశమే లేదు, ఎందుకంటే, మన దేశంలో మొట్టమొదటి  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సేవలు 2019లో మొదలయ్యాయి.

రెండవ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, అది ఇటీవల ప్రధాని మోదీ కేరళలో ప్రారంభించిన వందే భారత్ రైలుకు సంబంధించిన ఫోటో అని తెలిసింది. వార్త కథనాలను బట్టి (ఇక్కడ మరియు ఇక్కడ), వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే అధికారులు నీరు లీక్ అవటాన్ని గమనించారు. అయితే, రైలు కదిలే సమయానికి ముందే దాన్ని రిపేర్ చెయ్యటం జరిగింది.

చివరిగా, 2017లో రైలు ఇంజన్ నీళ్లు లీక్ అయిన సంఘటన ఇటీవల వందే భారత్ రైలులో జరిగిన సంఘటన అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll