Fake News, Telugu
 

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం (OPS) అమలుకు ఆమోదం తెలపలేదు

0

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం(OPS) అమలుకు ఆమోదం తెలిపింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనం ఫోటో ఒకటి జత చేశారు ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం(OPS) అమలుకు ఆమోదం తెలిపింది.

ఫాక్ట్ (నిజం): మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం(OPS) అమలుకు ఆమోదం తెలపలేదు. కేవలం నవంబర్ 2005 కంటే ముందు వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్లో నియామకం పొంది నవంబర్ 2005 తర్వాత జాయినింగ్ లెటర్‌ పొందిన 26,000 మంది ఉద్యోగులకు అమలు చేయడానికి మాత్రమే ఆమోదం తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

మహారాష్ట్ర ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు గత డిసెంబర్ 2023 మాసంలో పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలంటూ సమ్మె చేయడం జరిగింది. OPS పునరుద్ధరించాలనే డిమాండ్‌ను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించారు.

ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర కేబినెట్ 04 జనవరి 2024న నవంబర్ 2005 కంటే ముందు వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్లో నియామకం పొంది నవంబర్ 2005 తర్వాత జాయినింగ్ లెటర్‌ పొందిన 26,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS) అమలుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో వీరికి OPS లేదా CPS ఎంచుకొనే వెసులుబాటు లభిస్తుంది. నవంబర్ 2005కి ముందే ఉద్యోగంలో చేరిన దాదాపు 9.5 లక్షల మంది ఇప్పటికే OPS ప్రయోజనాలను అనుభవిస్తున్నారు. ఇదే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేసిన పలు వార్తసంస్థల కథనాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

OPS కింద, ఒక ప్రభుత్వ ఉద్యోగి అతను/ఆమె చివరిగా తీసుకున్న జీతంలో 50%కి సమానమైన మొత్తాన్ని నెలవారీ పెన్షన్‌గా పొందుతాడు.  OPS విధానంలో ఉద్యోగులు ఎటువంటి మొత్తాన్ని చెల్లించరు. కొత్త పెన్షన్ స్కీమ్ (NPS) కింద, ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అతను/ఆమె బేసిక్ జీతంలో 10%, డియర్‌నెస్ అలవెన్స్‌తో (DA) కూడిన మొత్తాన్ని వాటాగా చెల్లించాలి, రాష్ట్రం తన సహకారంగా బేసిక్ జీతంలో 14%, డియర్‌నెస్ అలవెన్స్‌తో  పాటుగా జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఆమోదించిన అనేక పెన్షన్ ఫండ్‌లలో ఒకదానిలో పెట్టుబడిగా పెట్టబడుతుంది మరియు రిటర్న్‌లు మార్కెట్-లింక్  చేయబడతాయి. OPS, NPS కు సంబధించిన సమాచారం ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేసేందుకు ఆమోదం తెలపలేదు.

Share.

About Author

Comments are closed.

scroll