Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియో 2022లో మన్యం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ జీతాలు చెల్లించాలని అప్పటి YSRCP ప్రభుత్వాన్ని కోరుతూ భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన దృశ్యాలను చూపిస్తుంది

0

“ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జనవరి 2025లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 2022 నాటిది. ఈ వీడియో 08 నవంబర్ 2022న పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ జీతాలు చెల్లించాలని అప్పటి YSRCP ప్రభుత్వాన్ని కోరుతూ భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన దృశ్యాలను చూపిస్తుంది. జూన్ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇలాంటి నిరసన తెలిపినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఇటీవల జనవరి 2025లో కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం జూన్ 2024లో అధికారంలోకి వచ్చాక కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, జూన్ 2024 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇలాంటి నిరసన తెలిపినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఈ క్రమంలో 05 జనవరి 2025 దాటినా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంకా వేతనాలు అందలేదని సాక్షి పత్రిక ప్రచురించిన సాక్షి పత్రిక ప్రచురించిన కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఇకపోతే, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న అధిక నిడివి గల వీడియోను (ఆర్కైవ్డ్) ‘AnyNews Telugu’ అనే యూట్యూబ్ ఛానెల్ 09 నవంబర్ 2022న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణ ప్రకారం, నవంబర్ 2022లో విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ జీతాలు వెంటనే  చెల్లించాలని డిమాండ్ చేస్తూ అప్పటి YSRCP ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోను ఇదే వివరణతో ‘Repati kosam’ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా 09 నవంబర్ 2022న షేర్ (ఆర్కైవ్డ్) చేసినట్లు మేము కనుగొన్నాము.

దీని ఆధారంగా ఈ నిరసన ప్రదర్శనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 09 నవంబర్ 2022న ‘ABN ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వార్తా కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించాలని, అక్టోబరు 2022 నెలకు సంబంధించిన జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు 09 నవంబర్ 2022న పార్వతీపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్‌ (UTF) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఇందులో భాగంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా భిక్షాటన చేశారు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో 2022లో మన్యం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అప్పటి YSRCP ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన దృశ్యాలను చూపిస్తుందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియో 2022లో పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అప్పటి YSRCP ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన దృశ్యాలను చూపిస్తుంది. 

Share.

About Author

Comments are closed.

scroll