Fake News, Telugu
 

ముస్లిం నాయకులు హిందువులపైన ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు.

0

ఇటీవల హర్యానాలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో, వివిధ ముస్లిం రాజకీయ నాయకులు మరియు మత గురువులు హిందువులపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: అక్బరుద్దీన్ ఒవైసీ, జాకీర్ నాయక్, మౌలానా సయ్యద్ అహ్మద్ మరియు బదరుద్దీన్ అజ్మల్ హిందువులపై చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు.

ఫాక్ట్: అక్బరుద్దీన్ ఒవైసీ, జాకీర్ నాయక్ గతంలో హిందువులపైన అనుచిత వ్యాఖ్యలు చేనప్పటికీ పోస్టులో పేర్కొన్న వ్యాఖ్యలు వారు చేసినట్లు ఆధారాలు లేవు. ఇక బద్రుద్దీన్ అజ్మల్, తాను అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు మద్దత్తునిస్తున్నానే ఆరోపణలు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లు ఇదివరకే ఉత్తరప్రదేశ్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంటించగా, పోలీసులు వాటిని తొలగించి శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే ఉద్దేశంలో వీటిని అంటించారని, బాధ్యులపై కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, “హైదరాబాద్ లో మా ముస్లిం జనాభా 50% దాటింది…* ఇప్పుడు మేము మెజారిటీలో ఉన్నాం. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే హైదరాబాద్ లో హిందూ పండుగలైన శ్రీరామనవమి, హనుమన్ జయంతి వంటి వాటిపైన ఆంక్షలు విధించాలి. మా బలం వల్ల చార్మినార్ దగ్గర గల భాగ్యలక్ష్మి ఆలయంలో గంటలు మోగకుండా అడ్డుకున్నాం. త్వరలోనే ఆ ఆ ఆలయాన్ని కూల్చివేస్తాం” అని  AIMIM పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేసినవిగా చెప్తున్న వ్యాఖ్యలను పరిశీలించగా, ఆయన హిందువులను, హిందూ దేవతలను, దేవాలయాలను అవమానించే విధంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయనపై 2013లో రెండు కేసులు నమోదు కాగా 40 రోజులు జైలు శిక్ష అనుభవించి తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. సరైన సాక్షాధారాలు లేని కారణంగా 2022లో కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. అయితే పోస్టులో చెప్పినట్లుగా హిందూ పండుగలను, ఊరేగింపులను అడ్డుకుంటానని ఆయన చెప్పినట్లు ఆధారాలు లేవు.

ఇక ఇస్లాం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్‌ను 2016లోనే మనీ లాండరింగ్, విద్వేషపూరితమైన ప్రసంగాలను చేస్తున్నారనే కారణంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆయనకి చెందిన సంస్థలను దేశంలో బహిష్కరించింది. అయితే వైరల్ పోస్టులో పేర్కొన్న విధంగా ఆయన వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో ఎక్కడా మాకు కథనాలు లభించలేదు.

“20% ఉన్నా ముస్లిమ్స్ బలాన్ని 80% ఉన్నా హిందువులు ఎదుర్కొంటూ తమ సొంత దేశంలో ఒక రాముడి మందిరం కూడా కట్టుకోలేక పోతున్నారు.  అదే సౌదీ అరేబియాలో కానీ పాకిస్తాన్ లో కానీ లేదా 56 ఇస్లామిక్ దేశాలలో ఏ ఒక్క దేశంలోనైనా ఒక మసీదు నిర్మాణాన్ని అడ్డుకునే సత్తా హిందువులకి ఉందా???”  అని జామా మసీద్ ఇమామ్ మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి వ్యాఖ్యానించినట్లు ఆధారాలు లేవు. పైగా, 2018లోనే తనకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఇలాంటి పోస్టులను ఆయన ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

అయితే, 2021లో జాకీర్ నాయక్ చిత్రాన్ని జత చేస్తూ ఇదే సందేశం కలిగి ఉన్న ఒక హోర్డింగుని ఉత్తరప్రదేశ్‌లోని కుండా పట్టణంలోని టీపీ ఇంటర్ కాలేజీ గోడలపై అతికించారు. జాకీర్ నాయక్‌తో పాటు అక్బరుద్దీన్ ఒవైసీ, ఆజం ఖాన్, మరియు ఇతర ముస్లిం ప్రముఖుల చిత్రాలని జోడిస్తూ అనేక వివాదాస్పదమైన పోస్టర్లను కుండా పట్టణంలో ప్రదర్శించినట్టు తెలిసింది. మత విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఈ హార్డింగులను అతికించారని ప్రతాప్‌గఢ్ పోలీసులు అప్పుడు స్పష్టం చేసారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

ఇక, AIDUF పార్టీ నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్ అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులకు మద్దత్తునిస్తూ మాట్లాడినట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవు. పైగా, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమ వలసదారులని తిరిగి ఆ దేశానికే పంపించేయాలని, తాను అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు మద్దత్తునిస్తున్నానే ఆరోపణలు అవాస్తవం అని ఆయన స్పష్టం చేశారు.

చివరిగా, ముస్లిం నాయకులు, బోధకులు హిందువులపైన ఇటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలను చేసినట్లు ఈ పోస్టులో షేర్ చేస్తున్న సమాచారం అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll