Fake News, Telugu
 

2016 బాస్టిల్ డే టెర్రరిస్ట్ దాడి నాటి వీడియోని ఇప్పుడు ఫ్రాన్స్‌లో ముస్లిం శరణార్థులు ఆ దేశస్థుల్ని చంపిన దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

ఫ్రాన్సులో ముస్లిం శరణార్థులు అక్కడివారిని చంపుతున్నారని, మీడియాలో ఈ విషయం గురించి చెప్పట్లేదు అంటూ, రక్తపు మడుగులో, రోడ్డుపై నిర్జీవంగా పడి ఉన్న కొందరిని చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది. ఈ కథనం ద్వారా, ఈ వీడియో వెనుక ఉన్న వాస్తవికతను ధృవీకరిద్దాం.

క్లెయిమ్: ఈ వీడియో, ఇటీవల ఫ్రాన్స్‌లో ముస్లిం శరణార్థులు ఫ్రాన్స్ దేశస్థుల్ని చంపిన దృశ్యాలని చూపుతుంది.

ఫాక్ట్(నిజం): ఇది 2016 నాటి వీడియో. బాస్టిల్ డే వేడుకల సందర్భంగా ఫ్రాన్స్‌లోని  నైస్‌లో జరిగిన ఉగ్రదాడిలోని బాధితులను ఈ వీడియో చూపుతుంది. ఇస్లామిక్ స్టేట్ యొక్క సానుభూతిపరుడు ఈ దాడి చేసినప్పటికీ, విజువల్స్ ఇటీవలి జరిగినవి కావు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాల్ని  తనిఖీ చేయడానికి, మేము వైరల్ వీడియో నుండి పొందిన కొన్ని కీఫ్రేమ్‌లను  Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ మమ్మల్ని 2016 నాటి కొన్ని వార్తా కథనాలకు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) దారితీసింది. వైరల్ వీడియోలో ఉన్న విజువల్స్‌ 2016లో బాస్టిల్ డే వేడుకల సందర్భంగా ఫ్రాన్స్‌లోని నైస్‌లో జరిగిన ఒక ఉగ్రదాడికి చెందినవి అని ఈ వార్త కథనాలు వివరించాయి  .

కథనాల ప్రకారం, “ఫ్రాన్స్ బాస్టిల్ డే జాతీయ సెలవుదినం గురువారం ముగిసిన సందర్భంగా జరుగుతున్న వేడుకల్లోకి , ఒక వ్యక్తి 19-టన్నుల ట్రక్కును వేగంతో జనాలపైకి నడిపించాడు. అతను తన వాహనాన్ని దాదాపు 2 కి.మీ (1.5 మైళ్ళు) గుంపు గుండా దున్నిన తర్వాత, పిస్టల్‌తో కాల్పులు మొదలుపెట్టాడు. తర్వాత (పోలీసుల ద్వారా) కాల్చి చంపబడ్డాడు.

ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరుడు ‘మొహమ్మద్ లాహౌయేజ్-బౌహ్లెల్’ చేసిన ఈ దాడిలో 86 మంది ప్రాణాలు కోల్పోయారు (ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది). ఈ ట్రక్ దాడితో సంబంధం ఉన్న ఎనిమిది మంది వ్యక్తులకు డిసెంబర్ 2022లో ఫ్రెంచ్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ దాడికి ఇస్లామిక్ ఉగ్రవాదం మూలాలు ఉన్నాయనేది వాస్తవం అయినప్పటికీ, విజువల్స్ మరియు ఈ సంఘటన ఇటీవలివి కావు, వైరల్ పోస్ట్ ద్వారా ఇది తాజా సంఘటన అని అర్ధం వచ్చేలాగా తప్పుడు సమాచారం షేర్ చేస్తున్నారు.

చివరిగా, 2016 బాస్టిల్ డే టెర్రరిస్ట్ దాడి నాటి వీడియోని ఇప్పుడు ఫ్రాన్స్‌లో ముస్లిం శరణార్థులు ఫ్రాన్స్ దేశస్థుల్ని  చంపిన దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll