Fake News, Telugu
 

ఉజ్జయినిలో మహాకాళి సవారికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక యువకుడిని కొడుతున్న వీడియోని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు

0

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలో ఒక హిందూ యువకుడిని ముస్లింలు దారుణంగా కొట్టి చంపేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. హిందూ యువకుడిని కొట్టుకుంటూ ముస్లిం ప్రాంతంలోకి లాక్కొని వెళ్తుంటే, ఆ యువకుడి తల్లి దాడి చేస్తున్న ముస్లింలను ప్రాధేయపడుతున్న దృశ్యాలంటూ ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలో ఒక హిందూ యువకుడిని ముస్లింలు దారుణంగా కొట్టి చంపేసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఉజ్జయిని నగరంలోని మిర్చి నాల వీధిలో ద్విచక్ర వాహనంపై  వెళుతున్న ఒక ముస్లిం ఫిజియోతెరపిస్ట్ మహిళను ఇద్దరు హిందూ యువకులు రోడ్డుపై ఆపి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను కొట్టినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించి ముస్లింలు ఖరాకువా పోలీస్ స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న వేళ, ఒక యువకుడు ‘మహాకాళి సవారి’కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో హిందూ వర్గానికి చెందిన వ్యక్తులు పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఆ యువకుడిని కొట్టినట్టు తెలిసింది. పోస్టులో తెలుపుతున్నట్టు ఈ ఘటనలో ముస్లింలు హిందూ యువకుడిని కొట్టి చంపలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో క్లెయిమ్ చేస్తున్న వీడియో కోసం కి పదాలను ఉపయోగించి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Peoples Samachar’ వార్తా సంస్థ ఇటీవల ట్వీట్ చేసినట్టు తెలిసింది. ఉజ్జయినిలో ముస్లిం బాలిక వేధింపు కేసులో ధర్నా జరుగుతున్న వేల ఒక యువకుడు ‘మహాకాళి సవారి’కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, మరొక వర్గానికి చెందిన వారు ఎస్పీ ఆఫీసుకి వచ్చి నిరసన చేపట్టరాని ఈ ట్వీట్లో తెలిపారు. దీనికి సంబంధించి పోలిసు వారు కేసు నమోదు చేశారని, ఆ యువకుడు తరువాత క్షమాపణ చెప్పినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

అయితే, ఈ ఘటనకు సంబంధించి అనేక వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌లోని సమాచారం పై  జర్నలిస్ట్ తెలిపిన సమాచారానికి వేరుగా ఉంది. 28 జులై 2023 నాడు ఉజ్జయిన్ నగరంలోని మిర్చి నాల వీధికి చెందిన 29 ఏళ్ల  ముస్లిం మహిళ ఫిజియోథెరపిస్ట్ తన అమ్మతో కలిసి స్కూటీపై వెళ్తుండగా, హితేష్ బడ్వాయ అనే వ్యక్తి, వారి వాహనాన్ని ఆపి, ముస్లిం మహిళతో వాగ్వాదానికి దిగినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ ఘటనలో హిందూ యువకులు తన స్కూటీ తాళాలు తీసుకొని, తనని వేధించినట్టు బాధిత మహిళ ట్వీట్ కూడా పెట్టింది. బాధితురాలు కేకలు వేయడంతో ఆ మహిళ ఉండే ప్రాంతంలో నివసించే తౌఫిక్ ఖాన్ అనే వ్యక్తి, మహిళను వేధిస్తున్న హిందూ యువకులను అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. కానీ, హితేష్ బడ్వాయ తన సహాచారులతో కలిసి తౌఫిక్ ఖాన్‌ను చితకబాదారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ వీడియోకి సంబంధించి ఉజ్జయిన్ రిపోర్టర్ ఒకరు ‘Quint’ వార్తా సంస్థతో మాట్లాడారు. ముస్లిం యువతిపై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ముస్లిం కమ్యూనిటికి చెందిన చాలా మంది ఖరాకువా పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ధర్నా చేశారని, ధర్నా చేసిన తరువాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని ఈ రిపోర్టర్ తెలిపారు. అయితే, ఈ ధర్నా జరిగే సమయంలో ఒక యువకుడు ‘మహాకాళి సవారి’కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారని, అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో హిందూ మతానికి చెందిన వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆవేశంతో ఆ యువకుడిని కొట్టినట్టు ఈ రిపోర్టర్ తెలిపారు.  

ముస్లిం మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన హిందూ యువకులను అరెస్ట్ చేసి, వారి ఇళ్లను కూల్చేయాలని ఆ ప్రాంతంలోని ముస్లింలు ఖరాకువా పోలీస్ స్టేషన్ ఎదుట 28 జులై 2023 నాడు రాత్రి నిరసన చేపట్టారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్లిం అమ్మాయిపై దాడికి పాల్పడినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటున్న హిందూ యువకులను ముస్లింలు కొట్టి చంపినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ పోలీస్ వెబ్సైటులో అప్లోడ్ చేయలేదు. ఎఫ్ఐఆర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఈ ఆర్టికల్‌ను అప్డేట్ చేస్తాము.

చివరగా, ఉజ్జయినిలో మహాకాళి సవారికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక ముస్లిం యువకుడిని కొడుతున్న వీడియోని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll