Fake News, Telugu
 

ఇండోనేషియా యాత్రీకులు మక్కాను సందర్శించిన వీడియోను మక్కాలో రామాలయ ప్రాణప్రతిష్ట సంబరాలు అంటూ షేర్ చేస్తున్నారు

0

22 జనవరి 2024 నాడు అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరిగిన నేపథ్యంలో మక్కాలో రాముడి ప్రాణప్రతిష్ట సంబరాలు జరిగాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. వీడియోలో కాషాయ రంగు వస్త్రాలు ధరించిన కొందరు వ్యక్తులు మక్కాలోని కాబా ప్రాంగణంలో కూర్చొని ఉండడంతో ఈ వాదనను చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వాదనలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట పథ్యంలో మక్కాలో రాముడి ప్రాణప్రతిష్ట సంబరాలు జరిగాయి.

ఫాక్ట్(నిజం):  అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా మక్కాలో ఎలాంటి సంబరాలు జరగలేదు. ఈ వీడియో ఇండోనేషియా యాత్రీకులు మక్కాను సందర్శించినప్పటిది. ఇండోనేషియాలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు మక్కా  యాత్రీకులకు ఇలా ఒక డ్రెస్ కోడ్‌లను అందిస్తున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా మక్కాలో ఇలా రాముడి ప్రాణప్రతిష్ట సంబరాలు జరిగి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు అలాంటి రిపోర్ట్స్ ఏవి లభించలేదు. ఇకపోతే ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో అయోధ్యలో ప్రాణప్రతిష్ట (22 జనవరి 2024) కన్నా ముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది.

మక్కాలోని కాబాను దర్శించుకున్న దృశ్యాలు అంటూ ఇదే వీడియో అయోధ్య ప్రాణప్రతిష్ట కన్నా ముందు నుండే యూట్యూబ్‌లో షేర్ చేసారు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఐతే యూట్యూబ్‌ పోస్టులలో ఎక్కడ కూడా ఈ వీడియోకు ప్రాణప్రతిష్టకు ముడిపెట్టలేదు.

ఐతే వీడియోలోని వ్యక్తులు ధరించిన కాషాయ వస్త్రాల ఆధారంగా వెతకగా ఇండోనేషియా వాసులు ఉమ్రా తీర్థయాత్ర (మక్కా) చేసిన వార్తను రిపోర్ట్ చేసిన పలు పాత ఇండోనేషియా వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియో రిపోర్ట్‌లలో చూపించిన మక్కా యాత్రీకులు కూడా వైరల్ వీడియోలోని వ్యక్తులు వేసుకున్న కాషాయ వస్త్రాలు ధరించి ఉండడం గమనించొచ్చు.

ఈ రిపోర్ట్స్ ఆధారంగా వెతకగా ఇండోనేషియా నుండి మక్కా యాత్రలు నిర్వహించే ట్రావెల్ ఏజెన్సీల యూట్యూబ్‌, సోషల్ మీడియా ప్రొఫైల్స్ మాకు కనిపించాయి.  ‘AN NAMIROH’ అనే ఒక ఇండోనేషియా ట్రావెల్ ఏజెన్సీ షేర్ చేసిన వీడియోలో మక్కా యాత్రీకులు కూడా ఇలాంటి కాషాయ వస్త్రాలు, బ్యాగ్‌లనే ధరించారు (ఇక్కడ & ఇక్కడ). దీన్నిబట్టి వైరల్ వీడియోలోని వ్యక్తులు కూడా ఈ ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే మక్కా ప్రయాణించి ఉండొచ్చు అని అనుకోవచ్చు.

ఈ సంస్థ సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు అనేక ఉన్నాయి (ఇక్కడ). కాషాయ వస్త్రాలు ధరించి కాబా ప్రాంగణంలో తిరుగుతున్న వీడియోలు కూడా చూడొచ్చు.

కాగా ఇండోనేషియాకు చెందిన వివిధ ట్రావెల్ ఏజెన్సీలు కూడా మక్కా యాత్రీకులకు సంబంధించి ఇలానే వివిధ డ్రెస్ కోడ్‌లను పాటిస్తున్న దృశ్యాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). దీన్నిబట్టి వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తులు ధరించింది కూడా ఒక డ్రెస్ కోడ్ అని, హిందూ ధర్మంలో ప్రాముఖ్యత కలిగిన కాషాయం కాదని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, ఇండోనేషియా యాత్రీకులు మక్కాను సందర్శించిన వీడియోను మక్కాలో రామాలయ ప్రాణప్రతిష్ట సంబరాలు అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll