Fake News, Telugu
 

భారత దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చి ఇతర మతస్థులని దేశం నుండి తరిమేయాలని మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి అనలేదు

0

ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దేశంలోని పలు రాష్ట్రాలలో ముస్లింలు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో, భారత దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చి హిందువులు మరియు ఇతర మతస్థులని కాశ్మీర్ హిందూ పండిట్ల తరహాలో దేశం నుండి తరిమివేయాలని జాకీర్ నాయక్, అలాగే ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమాం మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి దేశంలోని ముస్లింలకు ఆదేశాలిచ్చినట్టు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ అవుతున్నాయి. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చి ఇతర మతస్థులని దేశం నుండి తరిమేయాలని జాకీర్ నాయక్, మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి దేశంలోని ముస్లింలకు పిలుపునిచ్చారు.

ఫాక్ట్: ఈ పోస్టులలో తెలుపుతున్న వ్యాఖ్యలని జాకీర్ నాయక్ గాని, మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి గాని చేసినట్టు ఆధారాలు లేవు. భారత దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చి ఇతరేతర మతస్థులని తరిమివేయాలని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ సందేశాన్ని తాను ఇవ్వలేదని మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి 2018లోనే మీడియాకు స్పష్టం చేసారు. కావున, ఈ పోస్టులలో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్ట్ -1:

ముస్లింలు మరింత ఎక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేయగలిగితే భారతదేశాన్ని సులభంగా ఇస్లామిక్ దేశంగా మార్చవచ్చని, దేశంలో ముస్లింల జనాభా 50 శాతం దాటిన తరువాత ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి షరియా చట్టం అమలు చేయబడుతుందని, ఆ తరువాత హిందువులు మరియు ఇతరేతర మతస్థులని కాశ్మీర్ పండిట్ల తరహాలో దేశం నుండి తరిమివేయవచ్చని జాకీర్ నాయక్ పేర్కొన్నట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. కాని, జాకీర్ నాయక్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. జాకీర్ నాయక్ హిందూ మతానికి వ్యతిరేకంగా అనేక సార్లు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఈ పోస్టులో షేర్ చేస్తున్న వ్యాఖ్యలు చేసినట్టు ఆధారాలు లేవు.

అయితే, 2021లో జాకీర్ నాయక్ చిత్రాన్ని జత చేస్తూ ఇదే సందేశం కలిగి ఉన్న ఒక హోర్డింగుని ఉత్తరప్రదేశ్  రాష్ట్రం కుండా పట్టణంలోని టీపీ ఇంటర్ కాలేజీ గోడలపై అతికించారు. జాకీర్ నాయక్‌తో పాటు అక్బరుద్దీన్ ఒవైసీ, ఆజం ఖాన్, మరియు ఇతర ముస్లిం ప్రముఖుల చిత్రాలని జోడిస్తూ అనేక వివాదాస్పదమైన పోస్టర్లని కుండా పట్టణంలో ప్రదర్శించినట్టు తెలిసింది.

మత విద్వేషాలను రెచ్చగోట్టాలనే ఉద్దేశంతో కొందరు అల్లరిమూకలు కావాలనే ఈ హార్డింగులని అతికించారని ప్రతాప్‌గఢ్ పోలీసులు అప్పుడు స్పష్టం చేసారు.

పోస్ట్ -2:

భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బెంగాల్, కేరళ, హైదరాబాద్, అస్సాంలలో ముస్లింలు మెజారిటీ అయ్యారు. ఇస్లాం ప్రకారం, ముస్లింలు మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో ముస్లిమేతరులు ఉండటం హరామ్, అందుకే హిందువులు ఈ ప్రాంతాలను ఖాళీ చేయాలి, లేకపోతే మేము ఏమి చేస్తాము. కాశ్మీర్లో హిందూ పండిట్లకు ఏమైంది”, అని ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమాం మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి పేర్కొన్నట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. అయితే, తన పేరుని జత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ సందేశాన్ని తాను ఇవ్వలేదని మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి 2018లోనే మీడియాకు స్పష్టం చేసారు. దీనికి సంబంధించి ‘The Siasat Daily’ 2018లో ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది. శాంతియుతంగా జీవిస్తున్న ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ తప్పుడు సందేశాన్ని తన పేరుని జత చేస్తూ షేర్ చేస్తున్నట్టు మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి తెలిపారు.

అంతేకాదు, ఈ పోస్టులో తెలుపుతున్నట్టు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాలలో, అలాగే హైదరాబాదు ప్రాంతంలో ముస్లింలు మెజారిటీగా లేరు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్, బెంగాల్, కేరళ, హైదరాబాద్, అస్సాంలలో ముస్లిం జనాభా శాతాన్ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 2019లో మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి పేరుని జత చేస్తూ ఈ సందేశాన్ని షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, భారత దేశాన్ని ముస్లిం మెజారిటీ దేశంగా మార్చి ఇతరేతర మతస్థులని దేశం నుండి తరిమేయాలని జాకీర్ నాయక్, మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారి అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll