హిందువుల నుండి వస్తువులు కొనకూడదని ఇటీవల ఫత్వా జారీ చేసారని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హిందువుల నుండి వస్తువులు కొనకూడదని ఇటీవల ఫత్వా జారీ చేసారు.
ఫాక్ట్: హిందువుల నుండి వస్తువులు కొనకూడదని ఇటీవల ఫత్వా జారీ చేసారనడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. భారత దేశంలో అతిపెద్ద ముస్లిం సెమినరీలలో ఒకటైన దారుల్ ఉలూమ్ దియోబంద్, హిందూ ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినకపోవడం మంచిదని తమ వెబ్సైటులో తెలిపింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇటీవల అటువంటి ఫత్వా జారీ చేసినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది జరిగుంటే, దీని గురుంచి అనేక రిపోర్ట్స్, కథనాలు ఉంది ఉండాలి.
దారుల్ ఉలూమ్ దియోబంద్ వెబ్సైటులో హిందూ ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినకపోవడం మంచిదని తెలిపింది. ఒక వ్యక్తి ఇస్లాం గురించి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఇలా తెలిపినట్టు తెలుస్తుంది.
దారుల్ ఉలూమ్ దియోబంద్ భారతదేశంలోని అతిపెద్ద ముస్లిం సెమినరీలలో ఒకటి. అప్పుడప్పుడు వివాదాస్పద ఫత్వాలు జారీ చేస్తోంది. మహిళలు పని చేయడం, కుటుంబాన్ని పోషించడం చట్టవిరుద్ధమని దారుల్ ఉలూమ్ దియోబంద్ ఒకసారి ఫత్వా జారీ చేసింది. ఫోటోగ్రఫీ ఇస్లాంకు విరుద్ధమని దాన్ని నిషేధిస్తూ ఒకసారి ఫత్వా కూడా జారీ చేసింది.
హిందువులను అనారోగ్యానికి గురి చేసేందుకు రసాయనాలతో కూడిన ఆహారాన్ని విక్రయించాలని ముస్లింలను కోరుతూ దారుల్ ఉలూమ్ దియోబంద్ ‘ఫత్వా’ జారీ చేసిందని ఇంతకముందు కొందరు షేర్ చేసినప్పుడు, అది తప్పు అని చెప్తూ FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్ కూడా రాసింది.
చివరగా, హిందువుల నుండి వస్తువులు కొనకూడదని ఇటీవల ఫత్వా జారీ చేసారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.