Fake News, Telugu
 

2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ గెలిచిన స్థానాలలో వారికి లభించిన అత్యల్ప ఆధిక్యత 1,587

0

ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 4 జూన్ 2024న ప్రకటించబడ్డాయి. మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో, బీజేపీ 240 సీట్లను గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మొత్తం 272 సీట్ల అవసరం కాగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ (NDA) కూటమి 293 సీట్లను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 500 కంటే తక్కువ ఓట్ల ఆధిక్యతతో  30 సీట్లు, 100కి పైగా సీట్లు 1000 కంటే తక్కువ  ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది అని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్టును  సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: 2024 లోక్‌సభ ఎన్నికలలో, బీజేపీ 500 కంటే తక్కువ ఓట్ల ఆధిక్యతతో  30 సీట్లు, 1000 కంటే తక్కువ ఓట్ల ఆధిక్యతతో 100కి పైగా సీట్లు గెలిచింది. 

ఫాక్ట్:  2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ గెలిచిన స్థానాలలో వారికి లభించిన అత్యల్ప ఆధిక్యత 1,587 ఓట్లు. ఒడిశాలోని జాజ్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవీంద్ర నారాయణ్ బెహెరా బీజేడీ పార్టీ అభ్యర్థి శర్మిష్ట సేథిపై 1,587 ఓట్లతో విజయం సాధించారు. 2024 లోక్ సభ ఎన్నికలలో, బీజేపీ అభ్యర్థులు 240 సీట్లు గెలవగా, 10,000 లోపు ఓట్ల ఆధిక్యతతో  కేవలం 8 మంది బీజేపీ అభ్యర్థులు గెలవగా, 20000 లోపు ఓట్ల ఆధిక్యతతో 14 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

వైరల్ అవుతున్న క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా (ఈసీఐ) వెబ్సైటులో లిస్ట్ చేసిన 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలను పరిశీలించాము. ఇందులో పార్టీల వారీ ఫలితాలతో పాటు ఒక్కొక్క అభ్యర్థి ఎన్ని ఓట్ల ఆధిక్యతతో  గెలిచారు అనే సమాచారం కూడా ఉంది. మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల ఫలితాలను విశ్లేషించిన తర్వాత, శివసేన పార్టీకి చెందిన రవీంద్ర దత్తారం వైకర్ ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో అత్యల్ప ఓట్ల ఆధిక్యతతో (కేవలం 48 ఓట్లు) విజయం సాధించారని తెలిసింది. వైకర్‌కు మొత్తం 4,52,644 ఓట్లు రాగా, ఆ తరువాతి స్థానంలో నిలిచిన శివసేన (యుబిటి) అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్ 4,52,596 ఓట్లు సాధించారు.

2024 లోక్ సభ ఎన్నికలలో, బీజేపీ అభ్యర్థులు 240 సీట్లు గెలవగా, బీజేపీ అత్యల్ప ఓట్ల ఆధిక్యతతో (1587 ఓట్లు) ఒడిశాలోని జాజ్‌పూర్ నియోజకవర్గం నుండి గెలిచింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రవీంద్ర నారాయణ్ బెహెరా 5,34,239 ఓట్లు సాధించి, 532,652 ఓట్లు సాధించిన బీజేడీ పార్టీ అభ్యర్థి శర్మిష్ట సేథి పై 1587 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

అయితే, బీజేపీ రెండవ అత్యల్ప ఓట్ల ఆధిక్యతతో (1615 ఓట్లు) రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్ నియోజకవర్గంలో గెలిచింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 617,877 ఓట్లను సాధించి 616,262 ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ చోప్రాపై 1615 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

మొత్తానికి, 10,000 లోపు ఓట్ల ఆధిక్యతతో 8 మంది బీజేపీ అభ్యర్థులు గెలవగా, 20,000 లోపు ఓట్ల ఆధిక్యతతో 14 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. అయితే, కేవలం 7 మంది బీజేపీ అభ్యర్థులు మాత్రమే 5,000 కంటే తక్కువ ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి లభించిన అత్యల్ప ఓట్ల ఆధిక్యత 1,587. 

2024 లోక్ సభ ఎన్నికలలో అత్యల్ప ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించిన అభ్యర్థుల జాబితాని కింద చూడవచ్చు. 

ఇకపోతే, సబ్యసాచి దాస్ హర్యానా రాష్ట్రం, సోనిపట్‌లోని అశోక యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసారు. 2023లో, ఆయన “ డెమోక్రాటిక్ బ్యాక్ స్లయిడింగ్ ఇన్ ది వరల్డ్’స్ లార్జెస్ట్ డెమోక్రసీ “ అనే రీసెర్చ్ పేపర్ ని రాసారు. కొన్ని రిపోర్టుల (ఇక్కడ, ఇక్కడ) ప్రకారం, 2019 లోక్ సభ ఎన్నికలలో, బీజేపీ అధికార పార్టీగా ఉన్న రాష్ట్రాలలో బీజేపీకి, ప్రత్యర్థి పార్టీకి మధ్య గట్టి పోటీ, తక్కువ ఓట్లతో ఫలితం తేలిన నియోజకవర్గాలలో బీజేపీ ఫలితాలను తారుమారు చేసి ఆ సీట్లను గెలిచి ఉండవచ్చని ఆయన ఈ పేపర్లో సూచించారు. ఈ పేపర్ విడుదల తీవ్ర వివాదానికి దారి తీయడంతో అశోక యూనివర్సిటీ వారు ఈ పేపర్ తో తమకు ఏ సంబంధం లేదని తెలిపారు. ఆ తరువాత అశోక యూనివర్సిటీ నుండి తన పోస్టుకి సబ్యసాచి దాస్ రాజీనామా చేసారు. 2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఆయన చెప్పిన విషయాన్ని 2024 లోక్ సభ ఎన్నికలకు ముడిపెడుతున్నారు.

చివరగా, 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ గెలిచిన స్థానాలలో వారికి లభించిన అత్యల్ప ఓట్ల ఆధిక్యత 1,587; కేవలం 14 బీజేపీ అభ్యర్థులు మాత్రమే 20,000 లోపు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

Share.

About Author

Comments are closed.

scroll