రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్గో పార్సెల్ సేవలపై 25% డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో హిందూ పండుగలప్పుడు కాకుండా కేవలం ఇతర మతాల పండుగలప్పుడే ఇలాంటి ఆఫర్లు అందిస్తున్నారని అర్ధం వచ్చేలా క్లెయిమ్ చేస్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: తెలంగాణ ఆర్టీసీ హిందూ పండుగలప్పుడు కాకుండా కేవలం ఇతర మతాల పండుగలప్పుడే కార్గో పార్శిల్ ఛార్జీలపై 25శాతం సేవలపై ఆఫర్లు అందిస్తుంది.
ఫాక్ట్ (నిజం): రంజాన్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ అందిచే కార్గో సేవలపై ఆఫర్లు ప్రకటించిన మాట నిజమే అయినప్పటికీ ఇలా చేయడం మొదటిసారి కాదు. ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఇలాంటి ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. అంతకుముంది శ్రీరామనవమి సందర్భంగా కూడా ఇతర ఆఫర్లను ప్రవేశపెట్టింది. కేవలం పండుగలకు మాత్రమే కాకుండా పెళ్ళిళ్ళు మరియు ఇతర ఫంక్షన్లకు కూడా తెలంగాణ ఆర్టీసీ పలు రకాలైన ఆఫర్లను అందిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
రంజాన్ పండుగ సందర్భంగా ఆర్టీసీ కార్గో సర్వీసు ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. 5 కిలోల లోపు పార్శిళ్లకు సంబంధించి పార్శిల్ ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఇదే విషయాన్ని వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి.
ఐతే తెలంగాణ ఆర్టీసీ ఇలాంటి ఆఫర్లను కేవలం ఇతర మతాల పండుగల సమయంలో మాత్రమే కాకుండా హిందూ పండుగలప్పుడు కూడా ప్రకటించింది. ఉదాహారణకి ఈ నెల ప్రారంభంలో ఉగాది పండుగ సందర్భంలో కూడా తెలంగాణ ఆర్టీసీ ఇలాంటి ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అప్పుడు కూడా 5 కిలోల లోపు బరువుగల పార్శిళ్లకు సంబంధించి పార్శిల్ ఛార్జీలపై 25 శాతం డిస్కౌంట్ అందించింది. అంతే కాకుండా ఉగాది సందర్భంగ పండుగ రోజున 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఉచితంగా బస్సులో ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. అలాగే ఎయిర్పోర్ట్కు ఎలక్ట్రికల్ బస్సులు (పుష్పక్) బస్సులకు సంబంధించి అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్న వారు పది రోజుల లోపు మరోసారి టికెట్ బుక్ చేసుకుంటే 20 శాతం తగ్గింపు ఆఫర్‌ను కూడా అందించింది.
అంతకు ముందు శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ పలు ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా కేవలం పండుగలప్పుడు మాత్రమే కాకుండా పెళ్ళిళ్ళు, పుష్కరాలు మరియు ఇతర ఫంక్షన్లకు సంబంధించి తెలంగాణ ఆర్టీసీ పలు ఆఫర్లను అందిస్తుంది. వీటన్నిటిబట్టి, కేవలం ఇతర మతాల పండుగలకు మాత్రమే ఆఫర్లు అందిస్తున్నారన్న విమర్శ కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.
చివరగా, తెలంగాణ ఆర్టీసీ కేవలం ఇతర మతాల పండుగల సందర్భంలో మాత్రమే కాకుండా హిందూ పండుగల సందర్భంలో కూడా ఆఫర్లను అందించింది.