Fake News, Telugu
 

ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ స్థానానికి పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉందని తప్పుగా పేర్కొంటూ పాత వీడియోను షేర్ చేస్తున్నారు

0

ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 4 జూన్ 2024న ప్రకటించబడ్డాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ (NDA) కూటమి 293 సీట్లను గెలుచుకుంది, 09 జూన్ 2024న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే మోదీ పోటీ చేసిన వారణాసిలో పోలైన ఓట్లు 11.0 లక్షలు, లెక్కించిన ఓట్లు 12.87 లక్షలు, తేడా 1.87 లక్షలు, మోదీ మెజారిటీ 1.52 లక్షలు, దేశంలో 373 నియోజకవర్గాలలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ అని చెప్తూ వీడియోతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోలో పోస్టులో తెలిపిన అంశాలనే ఒక వ్యక్తి హిందీలో చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరిన్ని పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసి లోక్‌సభ స్థానంలో పోలైన ఓట్లు 11.0 లక్షలు కాగా లెక్కించిన ఓట్లు 12.87 లక్షలు.

ఫాక్ట్(నిజం): ఇదే వీడియో 2024 లోక్‌సభ ఎన్నికలు ప్రారంభానికి ముందు కూడా వైరల్ కాగా, 07 ఏప్రిల్ 2024న భారత ఎన్నికల సంఘం (ECI) ఈ వైరల్ వీడియోపై X(ట్విట్టర్)లో స్పందిస్తూ ఈ వీడియోలో ప్రస్తావిస్తున్న అంశాలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అలాగే, ECI పబ్లిష్ చేసిన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకారం, ఈ ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రధాని మోదీ 1,52,513 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఈ ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 19,97,578. ఈ ఎన్నికల్లో  పోల్ అయిన మొత్తం ఓట్ల సంఖ్య 11,30,143 కాగా వీటిలో ఈవీఎంలలో నమోదైన ఓట్ల సంఖ్య 11,27,081, పోస్టల్ బ్యాలట్ ఓట్ల సంఖ్య 3,062.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల విడుదలైన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వారణాసి లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐతే ఈ నేపథ్యంలో వారణాసి లోక్‌సభ స్థానంలో పోలైన ఓట్ల కంటే  లెక్కించిన ఓట్ల అధికంగా ఉన్నాయి అంటూ ఓ పోస్టు వైరల్ అవుతుంది. ఇదే వీడియో 2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి ముందు అంటే 19 ఏప్రిల్ 2024 కన్నా ముందే నుంచే ఆన్‌లైన్‌లో ఉందని అని తెలిసింది. అంటే ఈ వైరల్ వీడియోలో అతను 2019 ఎన్నికల గురించి ప్రస్తావించాడని తెలుస్తుంది. ఏప్రిల్ 2024లో ఈ పోస్టు వైరల్ అవ్వగా దీన్ని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు.

07 ఏప్రిల్ 2024న భారత ఎన్నికల సంఘం (ECI) ఈ వైరల్ వీడియోపై X(ట్విట్టర్)లో స్పందిస్తూ(ఆర్కైవ్డ్ లింక్) ఈ వీడియోలో ప్రస్తావిస్తున్న అంశాలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇంకా పోస్టులో ECI, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,56,791 అని, ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల సంఖ్య 10,58,744 అని,  2,085 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించారని అనగా మొత్తం పోల్ అయిన ఓట్లు మరియు లెక్కించిన ఓట్లు 10,60,829 అని స్పష్టం చేసింది. అలాగే తాము ఎప్పుడు దేశంలో జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 373 నియోజకవర్గాలలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నలేదు అని తెలిపింది(ఆర్కైవ్డ్ లింక్).

ECI 2019 లోక్‌సభ ఎన్నికలకి సంబంధించి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో పోలైన ఓట్లు మరియు మొత్తం ఓటర్ల సంఖ్యతో పాటు అనేక అంశాల పై డేటాను తమ వెబ్సైటులో విడుదల చేసింది (ఇక్కడ). ఈ డేటా పరిశీలిస్తే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,56,791మంది, పోల్ అయిన ఓట్లు 10,60,829 అని తెలిసింది.

ECI పబ్లిష్ చేసిన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకారం, ఈ ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రధాని మోదీ 1,52,513 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఈ ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 19,97,578 అని తెలిసింది. అలాగే, ఈ ఎన్నికల్లో  పోల్ అయిన మొత్తం ఓట్ల సంఖ్య 11,30,143 కాగా వీటిలో ఈవీఎంలలో నమోదైన ఓట్లు 11,27,081, పోస్టల్ బ్యాలట్ ఓట్లు 3,062 అని తెలుస్తుంది.

అలాగే 06 జూన్ 2024న ECI 2024 లోక్‌సభ ఎన్నికల్లో 7వ, చివరి దశలో నమోదైన ఓట్ల శాతం గురించి విడుదల చేసిన పత్రిక ప్రకటన ప్రకారం, ఈ ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య 19,97,578 కాగా పోల్ అయిన మొత్తం ఓట్ల సంఖ్య 11,28,527( పోస్టల్ బ్యాలట్ కాకుండా) అని పేర్కొన్నది.

ECI పత్రిక ప్రకటనలో తెలిపిన ఈవీఎం ఓట్ల సంఖ్యకు మరియు  ECI పబ్లిష్ చేసిన ఎన్నికల ఫలితాలలో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యల మధ్య 1446 ఓట్ల వ్యత్యాసం ఉంది.

ఈ వ్యత్యాసం ఎందుకు?

ఇలానే పలు పార్లమెంటరీ నియోజకవర్గాలలో నమోదైన ఈవీఎం ఓట్ల మరియు లెక్కించిన ఈవీఎం ఓట్ల మధ్య   వ్యత్యాసాలను పేర్కొంటున్న ఓ పోస్టు పై ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (CEO Uttarpradesh)  X(ట్విట్టర్)లో స్పందిస్తూ (ఆర్కైవ్డ్ లింక్) ఇలా ఎందుకు వ్యత్యాసాలు నమోదు అవుతాయో వివరణ ఇచ్చారు. ఈ వివరణ ప్రకారం, ఎన్నికల సంఘం జారీ చేసిన కొన్ని నిబంధనల (ఉదా. కౌంటింగ్ ఏజెంట్ కోసం హ్యాండ్‌బుక్ యొక్క పారా 11.4) ప్రకారం, కొన్ని పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను కొన్ని సందర్భాలలో లెక్కించరు. పోల్ చేయబడిన ఓట్లను లెక్కించని పోలింగ్ స్టేషన్లు రెండు వర్గాలుగా ఉంటాయి:

1)ప్రిసైడింగ్ అధికారి పొరపాటున అసలు(మాక్ పోల్ ముగిసిన తరువాత) పోల్‌ను ప్రారంభించే ముందు కంట్రోల్ యూనిట్ నుండి మాక్ పోల్ డేటాను క్లియర్ చేయని సందర్భంలో  లేదా అసలు పోల్‌ను ప్రారంభించే ముందు VVPAT నుండి మాక్ పోల్ స్లిప్‌లను తీసివేయని సందర్భంలో ఆ పోలింగ్ స్టేషన్‌లలో పోల్ అయిన ఓట్లను లెక్కించరు.

2)కంట్రోల్ యూనిట్‌లో పోలైన మొత్తం ఓట్లకు, ప్రిసైడింగ్ అధికారి తయారు చేసిన ఫారం 17-సిలోని ఓట్ల సంఖ్యతో తేడా వచ్చిన సందర్భంలో కూడా ఆ పోలింగ్ స్టేషన్‌లలో పోల్ అయిన ఓట్లను లెక్కించరు.

ఇలాంటి పోలింగ్ స్టేషన్‌లలో పోలైన ఓట్ల మొత్తం మొదటి మరియు రెండవ అభ్యర్థి మధ్య మార్జిన్‌(ఒకటవ అభ్యర్ధి మరియు రెండవ అభ్యర్ధి మధ్య ఓట్ల తేడా)కు సమానంగా ఉన్న లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా, పైన పేర్కొన్న రెండు కేటగిరీల పోలింగ్ స్టేషన్‌లలో పోల్ అయిన ఓట్లు కౌంటింగ్ ముగిసే సమయానికి లెక్కించబడతాయి. ఒకవేళ మార్జిన్ కంటే తక్కువగా ఉన్నట్లయితే, ఇలాంటి పోలింగ్ స్టేషన్‌లలో నమోదైన ఓట్లు లెక్కించబడవు. అందువల్లనే ఈవీఎంల ద్వారా పోలైన మొత్తం ఓట్లకు మరియు లెక్కించబడిన ఓట్లకు మధ్య కొన్ని సందర్భలలో వ్యత్యాసం ఏర్పడుతుంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచరం కోసం ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF) అధ్యక్షుడు వామన్ మెష్రామ్ (Waman Meshram) అని తెలిసింది. ఇతను ఈవీఎంలను అధికార భారతీయ జనతా పార్టీ దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపిస్తూ 31 జనవరి 2024న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఈవీఎంలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలతో నిరసన తెలిపినట్లు తెలిసింది.

చివరగా, ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ స్థానానికి పోలైన ఓట్లకు మరియు లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉందని తప్పుగా పేర్కొంటూ పాత వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll