Fake News, Telugu
 

ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించలేదు

0

“జాతీయ సమాజ్ వాదీ పార్టీ ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది.  ఆ పార్టీ గుర్తు సైకిల్, వాళ్ళది జాతీయ పార్టీ కనుక ఆ గుర్తు వాళ్లకి ఇవ్వాల్సిందే. ఇక ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీకి ఎన్నికల సంఘం ఇంకో గుర్తు ఇస్తారు” అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో చూద్దాం.

క్లెయిమ్: జాతీయ సమాజ్ వాదీ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఈ పార్టీ మరియు టీడీపీది సైకిల్ చిహ్నం. సమాజ్ వాదీ పార్టీ జాతీయ పార్టీ కనుక ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీకి ఎన్నికల సంఘం ఇంకో గుర్తు ఇస్తారు.

ఫాక్ట్(నిజం): సమాజ్ వాదీ పార్టీ ఒక ప్రాంతీయ (స్టేట్) పార్టీ, జాతీయ పార్టీ కాదు. ఈ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఒకవేళ సమాజ్ వాదీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీగా పోటీ చెయ్యాలంటే ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఆర్డర్, 1968 పారా 10 ప్రకారం ప్రత్యేక నియమం పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకే రకమైన చిహ్నం ఉన్న ప్రాంతీయ పార్టీతో ఒక జాతీయ పార్టీ పోటీ చేయాలనుకుంటే దానికి గల రూల్స్ గురించి ఈ ఆర్డర్ ప్రస్తావించలేదు. పార్టీ చిహ్నాల విషయానికొస్తే పారా 9 (బి) ప్రకారం, 6A పేరాలో పేర్కొన్న రాష్ట్ర పార్టీ గుర్తింపు కోసం ఏదైనా కొత్త పార్టీ షరతులకు అనుగుణంగా ఉన్నప్పటికీ, ఒక రాష్ట్ర పార్టీకి కేటాయించిన గుర్తును వేరే రాష్ట్రంలోని మరొక పార్టీకి ఇవ్వలేరు. కానీ, 1997 సవరణకు ముందు ఒక రాజకీయ పార్టీ దాని గుర్తును రిజర్వ్ చేసి ఉంటే, అదే గుర్తు ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర పార్టీలకు కూడా రిజర్వ్ చేయబడి ఉంటే, క్లాజ్ (బి)లో పేర్కొన్న నియమం ఆ పార్టీకి వర్తించదు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ గురించి కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, సమాజ్ వాదీ పార్టీ రాబోయే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించినట్టు ఎటువంటి రిపోర్టు దొరకలేదు.

తెలుగుదేశం పార్టీ 1982లో ఆవిర్భవించి 1983 అసెంబ్లీ ఎన్నికల్లో గుర్తింపు లేని పార్టీగా పోటీ చేసింది. తరువాత 1985 ఎన్నికల నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పార్టీగా పోటీ చేయసాగింది. సమాజ్ వాదీ పార్టీ 1992 లో స్థాపించబడింది మరియు 1993 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో కలిసి సంకీర్ణ పార్టీగా పోటీ చేసింది. 1996 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది.  అయితే తెలుగు దేశం పార్టీ సమాజ్ వాదీ పార్టీకన్నా ముందే ప్రాంతీయ పార్టీగా గుర్తించబడింది అని గమనించవచ్చు. అంతే కాదు, సమాజ్ వాదీ పార్టీ  ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుంది మరియు జాతీయ పార్టీ స్థానాన్ని ఇంకా పొందలేదు.

పార్టీ చిహ్నాలకు సంబంధించిన రూల్స్ గురించి వెతికితే, దీని గురించి ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఆర్డర్, 1968లో ప్రస్తావించినట్టు గమనించాం. పారా 9 (బి) ప్రకారం, 6A పేరాలో పేర్కొన్నట్టు రాష్ట్ర పార్టీ గుర్తింపు కోసం ఏదైనా కొత్త పార్టీ షరతులకు అనుగుణంగా ఉన్నప్పటికీ, ఒక రాష్ట్ర పార్టీకి కేటాయించిన గుర్తును వేరే రాష్ట్రంలోని మరొక పార్టీకి ఇవ్వలేరు. కానీ, 1997 సవరణకు ముందు ఒక రాజకీయ పార్టీ దాని గుర్తును రిజర్వ్ చేసి ఉండి, అదే గుర్తు ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర పార్టీలకు కూడా రిజర్వ్ చేయబడి ఉంటే, క్లాజ్ (బి)లో పేర్కొన్న నియమం ఆ పార్టీకి వర్తించదు. అంటే, సవరణకు ముందు ఆ చిహ్నాలను ఉపయోగించిన రాష్ట్ర పార్టీ, ఇతర రాష్ట్రంలోని రాష్ట్ర పార్టీకి ఆ చిహ్నం రిజర్వ్ చేయబడినప్పటికీ, ఆ చిహ్నాలను ఉపయోగించడానికి అనుమతించబడ్డాయి. ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ మరియు టీడీపీ 1997 సవరణ ముందే స్థాపించబడ్డాయి అని గమనించాలి.

పోస్టులో సమాజ్ వాదీ పార్టీ నేషనల్ పార్టీ అని పేర్కొన్నారు. నిజానికి అది ఒక ప్రాంతీయ పార్టీ. ఒకవేళ సమాజ్ వాదీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీగా పోటీ చెయ్యాలంటే పారా 10 ప్రకారం ప్రత్యేక నియమం పాటించాల్సి ఉంటుంది. అయితే, ఒక పార్టీ ఒక నిర్దిష్ట రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్ర పార్టీగా గుర్తించబడి వేరొక రాష్టంలో ఎన్నికల్లో పోటీ చేస్తే, ప్రాంతీయ పార్టీగా గుర్తించబడిన రాష్ట్రాల్లో రిజర్వ్ చేయబడిన చిహ్నాన్ని, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలోని ఫ్రీ సింబల్స్ లిస్టులో లేకపోయినా వాడవచ్చు. పేర్కొన్న అభ్యర్థి మరియు రాష్ట్ర పార్టీ కొన్ని షరతులను నెరవేర్చాలి.

  •  పేర్కొన్న అభ్యర్థికి ప్రత్యేకంగా గుర్తును కేటాయించడం కోసం పార్టీ ECIకి నోటిఫికేషన్ వెలువడిన మూడు రోజుల్లోగా దరఖాస్తును సమర్పించాలి.
  • అలాగే, అభ్యర్థి తన నామినేషన్ పత్రంలో తాను పేర్కొన్న పార్టీ ద్వారా నామినేట్ అయ్యానని, పారా 13లో పేర్కొన్న షరతులను కూడా పార్టీ నెరవేరుస్తుందని డిక్లరేషన్ చేయాలి.
  • ఈ దరఖాస్తును తిరస్కరించడానికి కమిషన్‌కు సహేతుకమైన కారణం కనిపించకూడదు.

ఒకవేళ ఒకే రకమైన చిహ్నం ఉన్న ప్రాంతీయ పార్టీతో ఒక జాతీయ పార్టీ పోటీ చేయాలనుకుంటే దానికి గల రూల్స్ గురించి ఈ ఆర్డర్ ప్రస్తావించలేదు. దీని గురించి స్పష్టత కోరుతూ Factly ఎలక్షన్ కమీషన్‌కు రాయడం జరిగింది.

చివరిగా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll