Fake News, Telugu
 

తాను భారత్‌లో ఉండలేనని పాకిస్థాన్‌లో జరిగిన కార్యక్రమంలో జావేద్ అఖ్తర్ అనలేదు

0

ప్రముఖ సినిమా రచయిత జావేద్ అఖ్తర్ ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో, తనకు కీర్తి, డబ్బును ఇచ్చిన భారతదేశంలో ప్రస్తుతం ఫాసిస్ట్ హిందూత్వ ప్రభుత్వం ఉన్నందున తాను అక్కడ ఉండలేనని ఆయన చెప్పినట్లు పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

ఇదే వీడియోని ఇక్కడ కూడా చూడవచ్చు

క్లెయిమ్: తాను భారత్‌లో ఉండలేనని ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జావేద్ అఖ్తర్ వ్యాఖ్యలు చేశారు.

ఫాక్ట్: జావేద్ అఖ్తర్ అటువంటి వ్యాఖ్యలేమీ చేయలేదు. పైగా 26/11 ముంబై దాడులు చేసిన ఉగ్రవాదులని పాకిస్థాన్ కాపాడుతోందని ఆయన ఇదే కార్యక్రమంలో విమర్శించాడు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు. 

ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆయన మాట్లాడినప్పటి పూర్తి వీడియోని పరిశీలించగా, ఎక్కడా కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదని నిర్ధారించవచ్చు. మీడియాలో ఎక్కడా కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు రిపోర్ట్ కాలేదు. ఈ విషయంపై మరింత పరిశోధన చేయగా, వీడియోలో ఉన్న సమాచారం tfipost.com అనే వెబ్‌సైట్లో ఇదే టైటిల్‌తో ఇదివరకే ప్రచురితమైందని గుర్తించాము. కాకపోతే, ఆ వ్యాసంలో జావేద్ అఖ్తర్ పై ఒకవేళ సినిమా రూపొందిస్తే, అందులో ఆయన ప్రారంభ ఉపన్యాసం ఇలా ఉంటుంది అని, ఒక కల్పిత ప్రసంగాన్ని ఈ వ్యాసంలో రాశారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఇదే కార్యక్రమంలో, “మీరు పాకిస్థాన్‌కు చాలా సార్లు వచ్చారు కదా, భారత్‌కు వెళ్ళి పాకిస్థానీలు కేవలం బాంబులు మాత్రమే వేస్తారని అనుకోకూడదని, వాళ్ళు మనల్ని ప్రేమతో స్వాగతిస్తారని చెప్తారా?” అని ఆయన్ని ప్రశ్నించగా, దానికి ఆయన “మనం ఒకరినొకరం నిందించుకోవడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల సమస్యలు పరిష్కారం కావు. నేను ముంబై నుంచి వచ్చాను. ముంబై పై జరిగిన 26/11 దాడిని ప్రత్యక్షంగా చూశాను. ఆ దాడి సూత్రధారులు నార్వే నుంచో, ఈజిప్ట్ నుంచో రాలేదు. వారు మీ దేశంలోనే ఉన్నారు. మీ దేశంలోనే వారు ఇప్పుడు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆ విషయంలో భారతీయులకు కోపం ఉంటే, మీరు దాన్ని తప్పుపట్టకూడదు” అని జవాబిచ్చారు.

చివరిగా, జావేద్ అఖ్తర్ పాకిస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తాను భారత్‌లో ఉండలేనని వ్యాఖ్యను చేశారనటానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll