Fake News, Telugu
 

కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఫేక్ న్యూస్ క్లిప్‌ను షేర్ చేస్తున్నారు

0

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో తనకు సంబంధం లేదని రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నట్టు చెప్తున్న ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రేవంత్ రెడ్డి ఇండియాటుడే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసాడని చెప్తున్న Way2News క్లిప్‌తో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో తనకు సంబంధం లేదు – ఇండియాటుడే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి

ఫాక్ట్(నిజం): ఇది ఒక ఫేక్ న్యూస్ క్లిప్‌. దీనిని డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించారు. Way2News సంస్థ కూడా ఇది ఒక ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ఇకపోతే వైరల్ క్లిప్‌లో రేవంత్ రెడ్డికు ఆపాదించిన వ్యాఖ్యలేవి కూడా ఇండియాటుడే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అధికారంలోకి వస్తే గృహ జ్యోతి, రైతు భరోసా, మహాలక్ష్మి, మొదలైన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం షేర్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో ప్రస్తావించింది ఈ గ్యారెంటీల గురించే. ఐతే వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అనలేదు.

ముందుగా ప్రస్తుతం షేర్ అవుతున్న Way2News న్యూస్ క్లిప్‌ నిజమైంది కాదు. దీన్ని డిజిటల్‌గా ఎడిట్ చేసి రూపొందించారు. Way2News రేవంత్ రెడ్డికు సంబంధించి ఈ వార్తను ప్రచురించిన కథనమేది మాకు కనిపించలేదు. సాధారణంగా Way2News తమ న్యూస్ క్లిప్‌లలో ఆ వార్తకు సంబంధించిన ఒక వెబ్ లింక్‌ను కూడా అందిస్తుంది. ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో అందించిన లింక్ అడ్రస్‌తో వెతికితే Way2News ఆగస్ట్ 2023లో క్రికెటర్ పృథ్వీషాకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. దీన్నిబట్టి ఈ క్లిప్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి రూపొందించినట్టు స్పష్టమవుతుంది.  పైగా Way2News కూడా ఈ క్లిప్‌ ఫేక్ అని వివరణ ఇచ్చింది.

ఇకపోతే  తమ వాదనకు మద్దతుగా ఇండియాటుడే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక క్లిప్ కూడా షేర్ అవుతుంది. ఐతే ఇండియాటుడే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలతో తనకు సంబంధం లేదని గానీ లేక గ్యారెంటీల అమలుకు ప్రస్తుత బడ్జెట్ సరిపోదని గానీ అనలేదు. వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో రేవంత్ రెడ్డికు ఆపాదించిన వ్యాఖ్యలేవీ కూడా అతను చేయలేదు. పైగా వైరల్ అవుతున్న క్లిప్‌లో విలేకరి అడిగిన ప్రశ్నను కూడా వక్రీకరించారు.

వీడియోలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి తన ఆలోచనలు పంచుకుంటున్న సందర్భంలో  ‘కర్ణాటకలో ఇలానే ఇచ్చిన గ్యారెంటీల అమలు చేసే క్రమంలో డెవలప్మెంట్ చేయడానికి నిధులు లేవని అక్కడి మంత్రులు అంటున్నారు. మరి తెలంగాణలో కూడా ఇదే జరుగుతుందా’ అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘నేను ఇంత సేపు చెప్పింది డెవలప్మెంట్ గురించి,  గ్యారెంటీల గురించి కాదు,’ అని అంటాడు.

ఐతే కేవలం ఈ ఒక్క బిట్‌ను కట్ చేసి షేర్ చేసారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా డెవలప్మెంట్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయని, మేము PPP పద్దతిలో డెవలప్మెంట్ చేస్తామని అంటాడు. దీన్నిబట్టి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసంబద్దంగా కట్ చేసి వక్రీకరిస్తూ షేర్ చేస్తున్నారని స్పష్టమవుతుంది.

చివరగా, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అన్నట్టు చెప్తున్న ఈ న్యూస్ క్లిప్‌ ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll