Fake News, Telugu
 

తాజ్ మహల్ భూభాగంలో శివుని మందిరం ఉందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కోర్టు స్వీకరించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

తాజ్ మహల్ యొక్క భూభాగంలో శివుని మందిరం ఉందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కోర్టు స్వీకరించిందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తాజ్ మహల్ భూభాగంలో శివుని మందిరం ఉందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కోర్టు స్వీకరించింది.

ఫాక్ట్: తాజ్ మహల్ యొక్క భూభాగంలో శివుని మందిరం ఉందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కోర్టు స్వీకరించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.       

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, సుప్రీంకోర్టులో అటువంటి పిటిషన్ స్వీకరించినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది గనక జరిగుంటే, అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి. సుప్రీంకోర్టు వెబ్సైటులో కూడా కీవర్డ్స్ తో వెతకగా, అలాంటి పిటిషన్ స్వీకరించినట్టు ఆధారాలు దొరకలేదు.

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా, భారతదేశంలో టూరిస్టులను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తాజ్ మహల్ గుర్తింపు పొందింది. ఏప్రిల్ 2015లో ఆగ్రా జిల్లా కోర్టులో తాజ్ మహల్ ఒక శివాలయం అని ఆరుగురు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించింది. హిందూ భక్తులను ‘దర్శనం’ మరియు ‘ఆర్తీ’ నిర్వహించడానికి తాజ్ మహల్ లోపలికి అనుమతించాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో తమ సమాధానాలను సమర్పించాలని కేంద్రం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, హోం కార్యదర్శి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను కోర్టు కోరింది.

నవంబర్ 2015లో పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాజ్ మహల్ శివాలయంగా ఉన్న దాఖలాలు లేవని అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ అన్నారు. తాజ్ మహల్ ఒక సమాధి మాత్రమే, ఆలయం కాదని ఆగస్టు 2017లో ఆగ్రా కోర్టుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది.

పి.ఎన్.ఓక్ తన 1989 పుస్తకం ‘తాజ్ మహల్: ది ట్రూ స్టోరీ’లో తాజ్ మహల్ ఒక శివాలయంగా ఉండేదని తెలిపారు. మొఘలులు భారతదేశంపై దాడి చేయడానికి శతాబ్దాల ముందు ఈ నిర్మాణం (1155లో) నిర్మించబడిందని ఓక్ ప్రతిపాదించాడు. తాజ్ మహల్ అనే పేరు “తెజో మహాలే” అనే సంస్కృత పదం నుండి వచ్చిందని పేర్కొన్నాడు. కానీ, తాజ్ మహల్ ను హిందూ రాజు నిర్మించాడని ప్రకటించాలన్న ఓక్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2000లోనే డిస్మిస్ చేసింది.

చివరగా, తాజ్ మహల్ భూభాగంలో శివుని మందిరం ఉందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కోర్టు స్వీకరించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll