Fake News, Telugu
 

పాకిస్థాన్ పార్లమెంట్‌లో “ఇమ్రాన్ ముర్దాబాద్, మోదీ జిందాబాద్” అని ఎంపీలు నినాదాలు చేయలేదు

0

ఉక్రెయిన్‌లోని పాక్ విద్యార్థులు తమ వాహనాలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఉంచి తమ ప్రాణాలను రక్షించుకున్నారనే వార్త పాకిస్తాన్‌కు చేరిన వెంటనే – పాకిస్తాన్ పార్లమెంటులో అపూర్వమైన రచ్చ ప్రారంభమైంది. ఇమ్రాన్ ముర్దాబాద్, మోదీ జిందాబాద్ నినాదాలతో ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రిని కూడా మాట్లాడనివలేదు”, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉక్రెయిన్‌లో పాక్ విద్యార్థులు భారత త్రివర్ణ పతాకం ఉపయోగించి తమ ప్రాణాలను రక్షించుకోవడంతో పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఎంపీలు “ఇమ్రాన్ ముర్దాబాద్, మోదీ జిందాబాద్” నినాదాలు చేసారు.

ఫాక్ట్: పోస్ట్‌లోనిది ఒక పాత వీడియో. ఆ వీడియోని 26 అక్టోబర్ 2020న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో తీసారు. ఆ వీడియోకీ, ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులకు సంబంధంలేదు. అంతేకాదు, వీడియోలోని వ్యక్తులు “ఓటింగ్…ఓటింగ్…” అని అరుస్తున్నారు, “ఇమ్రాన్ ముర్దాబాద్, మోదీ జిందాబాద్” అని కాదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆ వీడియోకి సంబంధించి ఎక్కువ నిడివి ఉన్న వెర్షన్ యూట్యూబ్‌లో దొరికింది. ఆ వీడియోని అక్టోబర్ 2020లో పోస్ట్ చేసి, “ఫ్రాన్స్ ఇస్లామోఫోబియాపై షా మెహమూద్ ఖురేషీ తీవ్ర వ్యాఖ్యలు” (తెలుగు అనువాదం) అని టైటిల్‌లో రాసినట్టు చూడవచ్చు. 35 సెకండ్ల దగ్గర పోస్ట్‌లోని వీడియో మొదలవుతున్నట్టు చూడవచ్చు. కాబట్టి పోస్ట్‌లోని వీడియోకీ, ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులకు సంబంధంలేదు.

వీడియోలోని వ్యక్తులు “ఓటింగ్…ఓటింగ్…” అని అరుస్తున్నారు, “ఇమ్రాన్ ముర్దాబాద్, మోదీ జిందాబాద్” అని కాదు. విపక్ష పార్టీ వారు “ఓటింగ్…ఓటింగ్…” అని అరిచారని మరియు ఆసిఫ్‌ను చూపిస్తూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ అతనిలోకి వెళ్లినట్టు తనకు అనిపిస్తుందని మంత్రి అన్నారని ‘Dawn’ అర్టికల్‌లో చదవచ్చు. “ఓటింగ్…అన్నీ జరుగుతాయి… ఓపికపట్టండి”, (తెలుగు అనువాదం) అని స్పీకర్ అరుస్తున్న సభ్యులకు చెప్పడం కూడా యూట్యూబ్ వీడియోలో చూడవచ్చు. వీడియోలో చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం నేషనల్ అసెంబ్లీ (26 అక్టోబర్ 2020) డిబేట్ డాక్యుమెంట్‌లో చూడవచ్చు.

అంతేకాదు, వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; పోస్ట్‌లో చెప్పినట్టు రక్షణ మంత్రి కాదు.

చివరగా, పాకిస్థాన్ పార్లమెంట్‌లో “ఇమ్రాన్ ముర్దాబాద్, మోదీ జిందాబాద్” అని ఎంపీలు నినాదాలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll