ఇటీవల కర్ణాటక హైకోర్టు విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేదాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ కేసు వాదన సమయంలో హిజాబ్‌కు మద్దతుగా వాదించిన లాయర్, వాదన సమయంలో జడ్జి చేత చివాట్లు తిన్నాడంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధాన న్యాయమూర్తి ఒక లాయర్‌ని మందలించడం గమనించొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: హిజాబ్ కేసు వాదనల సమయంలో హిజాబ్‌కు మద్దతుగా వాదించిన లాయర్‌ను ప్రధాన న్యాయమూర్తి మందలిస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ దృశ్యాలు 03 మార్చ్ 2022న కర్ణాటక హైకోర్టులో జరిగిన ఒక కమర్షియల్ అప్పీల్ వాదనలకు సంబంధించింది. ఈ వీడియోకు హిజాబ్ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. హిజాబ్ తీర్పు 15 మార్చి 2022న వెలువడింది. పైగా న్యాయమూర్తి చేత మందలించబడ్డ లాయర్‌కు హిజాబ్ కేసుతో ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
కర్ణాటక హైకోర్టులో జరిగే వాదనలు తమ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉన్న కోర్టు విచారణలకు సంబంధించిన వీడియోలను పరిశీలించగా, పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన పూర్తి వీడియో మాకు కనిపించింది. ఛానల్‌లో ఉన్న వివరణ ప్రకారం ఈ దృశ్యాలు 03 మార్చ్ 2022న జరిగిన కోర్టు వాదనలకు సంబంధించినవి.
అయితే హిజాబ్ కేసులో తీర్పు 15 మార్చి 2022న వెలువడింది, పైగా 03 మార్చ్ 2022న హిజాబ్ కేసుకి సంబంధించి ఎటువంటి వాదనలు జరగలేదు. దీన్నిబట్టి, వైరల్ దృశ్యాలు హిజాబ్ కేసుకు సంబంధించినవి కావని స్పష్టమవుతుంది.
పైన పేర్కొన్న యూట్యూబ్ వీడియోలో లాయర్‌ని మందలిస్తున్నది ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్తి అని స్పష్టంగా కనిపిస్తుంది. దీని ఆధారంగా కర్ణాటక హైకోర్టు వెబ్సైటులో వెతకగా ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ లాయర్‌ను మందలించిన కేసుకి సంబంధించిన తీర్పు కాపీ మాకు లభించింది.
ఈ తీర్పు కాపీలో ఉన్నదాని ప్రకారం ఇది ఒక కమర్షియల్ అప్పీల్‌కు సంబంధించిన కేసని, అలాగే న్యాయమూర్తి చేత మందలించబడ్డ లాయర్ పేరు సంజయ్ అని తెలుస్తుంది. ఈ ఆధారాల బట్టి కూడా వైరల్ వీడియో హిజాబ్ కేసుకి సంబంధించింది కాదని చెప్పొచ్చు, ఎందుకంటే హిజాబ్ కేసు పిటిషనర్ తరుపు న్యాయవాదులల్లో సంజయ్ పేరుతో ఎవరూ లేరు. హిజాబ్ కేసులో పిటిషనర్ తరుపు వాదించిన న్యాయవాదుల వివరాలు కింద చూడొచ్చు.
చివరగా, ఈ వీడియోలో న్యాయమూర్తి చేత మందలించబడ్డది హిజాబ్‌కు మద్దతుగా వాదించిన లాయర్ కాదు. అసలు ఈ వీడియోకు హిజాబ్ కేసుకి ఎటువంటి సంబంధం లేదు.