Fake News, Telugu
 

పాకిస్థాన్‌లో ఆడపిల్లల మృతదేహాలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్తలు నిజమే కానీ, సమాధికి తాళం వేసిన ఈ ఫోటోకి పాకిస్థాన్‌తో ఎటువంటి సంబంధం లేదు

0

పాకిస్థాన్‌లో ఆడపిల్లలు చనిపోతే మృతదేహాలపై అత్యాచారాలు జరగకూడదని ఇనుప గేటు వేసి, సమాధికి తాళం వేసిన తల్లిదండ్రుల చిత్రమిది అంటూ ఒక ఫోటోను షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: పాకిస్థాన్‌లో ఆడపిల్లలు చనిపోతే మృతదేహాలపై అత్యాచారాలు జరగకూడదని ఇనుప గేటు వేసి, సమాధికి తాళం వేసిన ఫోటో.

ఫాక్ట్(నిజం): సమాధికి తాళం వేసిన ఈ ఫోటో హైదరాబాద్‌లోని మాదన్నపేట్ రెయిన్ బజార్‌లోని స్మశాన వాటిక లోనిది. అక్కడి అధికారులు చెప్తున్నదాని ప్రకారం, చాలా మంది అనుమతి లేకుండా పాత సమాధులపై మృతదేహాలను పూడ్చేస్తుండడంతో ఒక వ్యక్తి ఇలా ఎవరూ తమ సమాధి తవ్వకుండా తాళం వేసుకున్నాడు. పాకిస్థాన్‌లో ఈ మధ్య నెక్రోఫిలియా ఘటనలు పెరుగుతున్నాయన్న వార్త నిజమైనప్పటికీ, ఈ ఫోటోకు పాకిస్థాన్‌తో ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

ఇటీవల పాకిస్థాన్‌లో అమ్మాయిలపై పెరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తను రిపోర్ట్ చేసిన ఒక కథనంలో  పాకిస్థాన్‌లో ఈ మధ్య పెరిగిపోతున్న నెక్రోఫిలియా (మృతదేహాలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం) ఘటనల గురించి ప్రస్తావించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వారి కుమార్తెల సమాధుల చుట్టూ ఇనుప కంచెలు వేస్తున్నారని కూడా ఈ కథనంలో పేర్కొంది.

పాకిస్థాన్‌లో గతంలో నుండే ఇలాంటి సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయి. 2011 నుండే ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. గతంలో ఇలాంటి ఘటనలను రిపోర్ట్ చేసిన కొన్ని పాకిస్థాన్‌ వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఇదే వార్తను రిపోర్ట్ చేసే క్రమంలో చాలా వరకు తెలుగు మీడియా సంస్థలు సమాధికి తాళం వేసిన ఉన్న ఫోటోను తమ కథనాలలో ప్రచురించారు. ఈనాడు, TOI Telugu, News 18 Telugu, Etv Bharat, Prime9 News మొదలైన సంస్థలతో పాటు మరికొన్ని ఆన్లైన్ మీడియా బ్లాగ్స్ కూడా ఈ ఫోటోను తమ కథనాలలో ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ సమాధి హైదరాబాద్‌లో ఉంది:

ఐతే నిజానికి ఈ ఫోటోకు పాకిస్థాన్‌తో ఎటువంటి సంబంధంలేదు. ఈఫోటో హైదరాబాద్‌లోని మాదన్నపేట్ రెయిన్ బజార్‌లోని స్మశాన వాటికలో ఒక వ్యక్తి ఇలా ఓ సమాధికి గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నాడు.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలా వరకు హైదరాబాద్‌ లోకల్ మీడియా సంస్థలు ఈ ఫోటో మాదన్నపేట్ రెయిన్ బజార్‌లోని స్మశాన వాటికలోనిదని రిపోర్ట్ చేసిన కథనాలు మాకు కనిపించాయి. ఈ సంస్థలు తమ వీడియో రిపోర్టులో రెయిన్ బజార్‌లోని స్మశాన వాటికలోని సంబధిత వ్యక్తులతో మాట్లాడి ఈ తాళం వేసిన సమాధికి సంబంధించి స్పష్టతను ఇచ్చారు.

ఈ కథనాల ప్రకారం రెయిన్ బజార్‌లోని స్మశాన వాటికలో చాలా మంది అనుమతి లేకుండా పాత సమాధులపై మృతదేహాలను పూడ్చేస్తుండడంతో కొందరు ఇలా ఎవరూ తమ సమాధి తవ్వకుండా తాళం వేసుకున్నట్టు తెలిపారు. ఈ సమాధి సుమారు 1.5-2 ఏళ్ళ పాతదని, గేటు ఎదురుగా ఉండడంతో కూడా ఎవరు తొక్కకుండా ఇలా గ్రిల్ల్స్ ఏర్పాటు చేసుకున్నారని కూడా తెలిపారు. ఈ వార్తా కథనాలు కొన్ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, పాకిస్థాన్‌లో ఆడపిల్లలు మృతదేహాలపై అత్యాచారాలు జరుగుతున్నయన్న వార్త నిజమే, కానీ సమాధికి తాళం వేసిన ఈ ఫోటో పాకిస్థాన్‌ది కాదు, హైదరాబాద్‌లోనిది.

Share.

About Author

Comments are closed.

scroll