‘లైంగిక వేధింపులకి గురవుతున్న మహిళా రెజ్లర్ల తరుపున న్యాయం కావాలి అని అడిగిన ఒక యువ రెజ్లర్ ని చితకబాదిన BJP MP బ్రిజ్ భూషణ్’ అనే క్లైయిముతో ఓక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై భారత రెజ్లర్‌లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వీడియో షేర్ చెయ్యబడుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపిస్తున్న మహిళా రెజ్లర్ తరపున న్యాయం కావలి అని అడిగినందుకు ఒక యువ రెజ్లర్‌ని చితక బాదిన BJP MP బ్రిజ్ భూషణ్.
ఫాక్ట్(నిజం): వాస్తవానికి ఈ వీడియోలో ఆ యువకుడిని కొట్టినది బ్రిజ్ భూషణ్ సింగ్ అయినా, ఈ సంఘటన ఇప్పటిది కాదు. 2021లో రాంచీలో జరిగిన ఒక అండర్ 15 నేషనల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కావున ఈ పోస్టులోని క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
మొదటిగా, వైరల్ పోస్టులోని క్లైయిముకి సంబంధించి ఏమైనా వార్త కథనాలు ఇంటర్నెట్‌లో ఉన్నాయా అని వెతికాము. డిసెంబర్ 2021లో ప్రచురితమైన కొన్ని వార్త కథనాల్లో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఈ వీడియోలోని సంఘటనను వివరిస్తూ రాసారు.
టైమ్స్ అఫ్ ఇండియా వారి కథనం ప్రకారం, డిసెంబర్ 2021లో రాంచీలోని షహీద్ గణపత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో అండర్ 15 నేషనల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. అయితే, వయస్సు ధ్రువీకరణ సమయంలో, పోటీల్లో పాల్గొనటానికి వచ్చిన ఒక రెజ్లర్, 15 ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు వాడు అని తెలిసి నిర్వాహకులు తనను పోటీల్లో పాల్గొననివ్వలేదు. ఈ నిర్ణయాన్ని తను ప్రతిఘటించాడు. అక్కడ ఉన్న స్టేజి పైకి వెళ్లి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు అయ్యిన బ్రీజ్ భూషణ్ సింగ్‌తో వాదించాడు. ఎంత చెప్తున్నా వినకపోవడంతో బ్రిజ్ భూషణ్ ఆ కుర్రవాడిని కొట్టారు.ఇదే సంఘటనను గురించిన మరింత సమాచారం మీరు ఇక్కడ మరియు ఇక్కడ పొందవచ్చు.
ఇదిలా ఉండగా, భారత రెజ్లర్ల నుండి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ మీద ఏప్రల్ 28న ఢిల్లీలో రెండు FIRలు నమోదు చేసారు.
చివరిగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ ఒక రెజ్లర్‌ని కొట్టిన ఈ వీడియో 2021 నాటిది.