Fake News, Telugu
 

‘ది ఫైర్ యోగి’ డాక్యుమెంటరీ విజువల్స్‌ను కుంభమేళాలో సిద్ధ సాధువులపై BBC బృందం తీసిన వీడియో అని షేర్ చేస్తున్నారు

0

BBC బృందం కుంభమేళాను కవర్ చేస్తున్నప్పుడు దాదాపు 400 మంది సిద్ధ సాధువులు తమ శరీరాన్ని అగ్ని దేవతకు సమర్పించడాన్ని ఇలా వీడియో తీసారని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. నిప్పుల కట్టెలపై పడుకొని ఉన్న సాధువులకు ఏమి జరగలేదని, అగ్నిమాపక రసాయనాల ఉనికిని కూడా గుర్తించలేకపోయారని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కుంభమేళాలో దాదాపు 400 మంది సిద్ధ సాధువులు తమ శరీరాన్ని అగ్ని దేవతకు సమర్పించడాన్ని ఇలా వీడియో తీసిన BBC బృందం.

ఫాక్ట్: ఈ వీడియో కుంభమేళాలో BBC బృందం తీయలేదు; ఈ వీడియో తంజావూరులోని యోగి, రాంబాహు స్వామి నిర్వహించిన అరుదైన అగ్ని ఆచారానికి సంబంధించింది. ‘ది ఫైర్ యోగి’ అనే డాక్యుమెంటరీ పేరుతో తమిళనాడులోని ఒక యోగి యొక్క ప్రయాణాన్ని తెలిపే వీడియో ఇది. కుంభమేళాలో దాదాపు 400 మంది సిద్ధ సాధువులు తమ శరీరాన్ని అగ్ని దేవతకు సమర్పించడాన్ని BBC బృందం వీడియో తీసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.     

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న యూట్యూబ్‌ వీడియో లభించింది. దాదాపు మొదటి మూడు నిమిషాలు ఈ యూట్యూబ్‌ వీడియో నుండి కట్ చేసి వైరల్ వీడియో చేసినట్టు చూడొచ్చు. ‘ది ఫైర్ యోగి’ అనే టైటిల్‌తో 23 మార్చ్ 2011న ఈ యూట్యూబ్‌ వీడియోను అప్లోడ్ చేసారు. ఆ యూట్యూబ్‌ వీడియో వివరణలో, ‘ది ఫైర్ యోగి’ అనేది ఒక యోగి యొక్క ప్రయాణాన్ని తెలిపే డాక్యుమెంటరీ అని, ఒక ప్రత్యేకమైన శ్వాస పద్ధతిని ఉపయోగించి ఇలా చేయగలుగుతున్నాడని తెలిపారు. కుంభమేళ గురించి గానీ, సిద్ధ సాధువులను BBC బృందం వీడియో తీయడం గురించి గానీ ఈ వీడియోలో చెప్పలేదు.

‘ది ఫైర్ యోగి’ గురించి వీడియోలు యూట్యూబ్‌లో ఎప్పటినుంచో ఉన్నాయి అవి ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

‘ది ఫైర్ యోగి’ గురించి గూగుల్లో వెతకగా ఈ డాక్యుమెంటరీ తంజావూరులోని యోగి, రాంబాహు స్వామి నిర్వహించిన అరుదైన అగ్ని ఆచారానికి సంబంధించిందని తెలుస్తుంది. 63 ఏళ్ల యోగి గత 45 ఏళ్ల కాలంలో 1000 రోజులకు పైగా ఈ అగ్ని ఆచారాన్ని నిర్వహించారని, ఒక ప్రత్యేకమైన శ్వాస పద్ధతిని ఉపయోగించి ఇలా చేయగలుగుతున్నాడని తెలిపారు.

రాంబాహు స్వామిపై ఆజ్ తక్ వారు వీడియో రిపోర్ట్ కూడా చేసారు. కానీ, కుంభమేళాలో దాదాపు 400 మంది సిద్ధ సాధువులు తమ శరీరాన్ని అగ్ని దేవతకు సమర్పించడాన్ని BBC బృందం వీడియో తీసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు మాకు దొరకలేదు.

చివరగా, తంజావూరులోని యోగిపై తీసిన ‘ది ఫైర్ యోగి’ అనే డాక్యుమెంటరీ యొక్క విజువల్స్‌ను పట్టుకొని కుంభమేళాలో సిద్ధ సాధువులపై BBC బృందం తీసిన వీడియో అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll