Fake News, Telugu
 

యేసు శిలువపై ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసినప్పటికీ, ఆ అధ్యయనం యొక్క ఫలితాలను ఇంకా బయటికి వెల్లడించలేదు

0

యేసు శిలువకు సంబంధించి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రచురించిన సమాచారం అంటూ పలు విషయాలను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: యేసు శిలువకు సంబంధించి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రచురించిన సమాచారం.

ఫాక్ట్ (నిజం): ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పురాతన క్రైస్తవ అవశేషాలపై అధ్యయనంలో భాగంగా యేసు శిలువ అవశేషాలపై కూడా అధ్యయనం జరిపిన మాట నిజమైనప్పటికీ, ఈ అధ్యయనం ఫలితాలు ఇంకా బయటికి వెల్లడించలేదు. శిలువపై వేసే సమయంలో యేసుకు అయిన గాయాలకు సంబంధించి పోస్టులో చెప్తున్న విషయాలు కూడా ఆక్స్‌ఫర్డ్‌ వెల్లడించినట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం చాలా కాలం నుండి పురాతన క్రైస్తవ అవశేషాలపై అధ్యయనం చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా 2015లో పురాతన క్రైస్తవ అవశేషాల అధ్యయనం కోసం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం కేబుల్ కాలేజీలో ఒక ప్రత్యేక అడ్వాన్స్‌డ్ స్టడీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పురాతన క్రైస్తవ అవశేషాలపై అధ్యయనంలో భాగంగా యేసు శిలువ అవశేషాలపై కూడా అధ్యయనం చేస్తున్నట్టు వెబ్సైటులోని సమాచారం ప్రకారం తెలిసింది. ఐతే ప్రస్తుతానికి ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు మాత్రం ఇంకా బయటికి వెల్లడించలేదు.

ఒకవేళ పోస్టులో చెప్తున్న విషయాలు నిజంగానే ఆక్స్‌ఫర్డ్‌ అధ్యయనంలో వెల్లడైయుంటే, ఈ వివరాలు ప్రజలకి అందుబాటులో ఉండేవి. కానీ ఆక్స్‌ఫర్డ్‌ పేరుతో అలాంటి సమాచారమేదీ అందుబాటులో లేదు. పైగా శిలువపై వేసే సమయంలో యేసుకు అయిన గాయాలకు సంబంధించి పోస్టులో చెప్తున్న విషయాలు కూడా ఆక్స్‌ఫర్డ్‌ వెల్లడించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. వేరే ఇతర విశ్వసనీయ పరిశోధనలు ఈ విషయాలు వెల్లడించినట్టు కూడా మాకు ఎటువంటి సమాచారం లభించలేదు.

ఇదిలా ఉండగా 2017లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా అప్పటి వరకు శాంటా క్లాజ్ ఎముకగా ప్రాచుర్యంలో ఉన్న ఎముక నిజంగానే శాంటా క్లాజ్ మరణించిన క్రీ.శ నాల్గవ శతాబ్దనికే చెందిందని నిర్దారించింది. ఈ అధ్యయనం ఆ ఎముక నిజంగానే శాంటా క్లాజ్ దేనని నిర్దారించనప్పటికీ, అది ఏ కాలానికి చెందిందో అన్న విషయాన్ని మాత్రమే వెల్లడించింది.

చివరగా, యేసు శిలువపై ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసినప్పటికీ, ఆ అధ్యయనం యొక్క ఫలితాలను ఇంకా బయటికి వెల్లడించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll