Fake News, Telugu
 

సెంగోల్ ప్రాముఖ్యతను గుర్తిస్తూనే, ఈ సంప్రదాయం అధికార మార్పిడికి ప్రతీకగా భావించడానికి ఆధారాలు లేవు అని మాత్రమే హిందూ పత్రిక పేర్కొంది

0

ఇటీవల నూతనంగా ప్రారంభించిన పార్లమెంట్ భవనంలో సెంగోల్‌ను ప్రతిష్టించిన నేపథ్యంలో ది హిందూ పత్రిక, సెంగోల్ చరిత్రకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్న దానికి వ్యతిరేకంగా సెంగోల్ ఒక కట్టుకథ అని వాదిస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ది హిందూ పత్రిక ఆగస్ట్ 1947లో తమ మొదటి పేజీలో సెంగోల్ గురించి ప్రచురించిన క్లిప్‌ను షేర్ చేస్తూ, అప్పుడు సెంగోల్ గురించి వార్త ప్రచురించిన పత్రిక, ఇప్పుడు సెంగోల్ ఒక కట్టుకథ అని చెప్తోందంటూ ఈ పోస్ట్ షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చేస్తున్న ఆరోపణలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: 1947లో తమ మొదటి పేజీలో సెంగోల్ గురించి ప్రచురించిన ది హిందూ పత్రిక, ఇప్పుడు సెంగోల్ ఒక కట్టుకథ అని వాదిస్తోంది.

ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వం సెంగోల్‌ చరిత్ర/ప్రాముఖ్యతకు సంబంధించి అందించిన ఆధారాలను పరిశీలిస్తూ ది హిందూ రాసిన కథనంలో నిజంగానే నెహ్రుకు సెంగోల్ అందించారనే విషయాన్ని గుర్తిస్తూనే, ఈ సంప్రదాయం అధికార మార్పిడికి ప్రతీకగా భావించడానికి ఆధారాలు లేవు అని మాత్రమే పేర్కొంది. ఈ కథనంలో హిందూ పత్రిక ఎక్కడా కూడా సెంగోల్ ఒక కట్టుకథ అని కొట్టిపాడేయడం లేదా సెంగోల్ ఉనికిని ప్రశ్నించడం చేయలేదు. హిందూ రాసిన ఈ కథనాన్ని వక్రీకరించి షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల నూతనంగా ప్రారంభించిన పార్లమెంట్ భవనంలో సెంగోల్‌ను ప్రతిష్టించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ సెంగోల్‌ చరిత్ర/ప్రాముఖ్యతను తెలుపుతూ ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌లో చెప్తున్నదాని ప్రకారం 1947 బ్రిటీష్ వారి నుండి అధికార మార్పిడికి చిహ్నంగా ప్రాచీన హిందూ సంప్రదాయం (చోళుల సంప్రదాయాలను అనుకరిస్తూ) పాటిస్తూ ఈ సెంగోల్‌ను మౌంట్ బాటెన్ నెహ్రుకి అందించాడు.

ఈ సెంగోల్‌ను మద్రాసులోని ప్రసిద్ధ స్వర్ణకారులతో తయారు చేయించి, 14 ఆగష్టు1947 రాత్రి ప్రత్యేక విమానంలో ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఒక ప్రతినిధి బృందాన్ని తమిళనాడు నుండి ఢిల్లీకి తరలించారని కూడా ఈ సమాచారంలో ఉంది.

అంతకు ముందు కేంద్ర మంత్రి అమిత్ షా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కూడా సెంగోల్‌కు సంబంధించి ఇవే విషయాలు తెలిపారు. అలాగే ఈ సెంగోల్‌ చరిత్రకు సంబంధించిన కొన్ని ఆధారాలను మీడియా ప్రతినిధులకు అందించారు.

ఐతే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సెంగోల్‌ చరిత్రకు సంబంధించి అందించిన ఆధారాలను పరిశీలించి ది హిందూ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో కేంద్ర ప్రభుత్వం అందించిన ఆధారాలలోని కొన్ని వైరుధ్యాలను చూపించే ప్రయత్నం చేసింది. అలాగే ఈ కథనంలో వైరల్ అవుతున్న 1947లో హిందూ ప్రచురించిన సెంగోల్‌ కథనం గురించి కూడా ప్రస్తావించింది.

ప్రభుత్వం అందించిన ఆధారాలు పరిశీలిస్తే అప్పట్లో అధికార మార్పిడికి ప్రతీకగా ఇలా సెంగోల్‌ను అందించారని చెప్పడానికి బలమైన సాక్షాలు లేవని హిందూ ఈ కథనంలో పేర్కొంది. అలాగే ప్రభుత్వం చెప్తున్నట్టు తమిళనాడు నుండి ప్రతినిధుల బృందం ప్రత్యేక విమానంలో కాకుండా ట్రైన్‌లో ఢిల్లీకి వెళ్లినట్టు ఆధారాలు సూచిస్తున్నాయని, ఇంకా ప్రభుత్వం చెప్తున్నట్టు మౌంట్ బాటెన్ కాక వేద పండితులు నెహ్రుకి  ఈ సెంగోల్‌ను అందించారని కూడా ఈ కథనంలో పేర్కొంది.

ఐతే ఈ కథనంలో హిందూ పత్రిక ఎక్కడా కూడా సెంగోల్ ఒక కట్టుకథ అని కొట్టిపాడేయడం లేదా సెంగోల్ ఉనికిని ప్రశ్నించడం చేయలేదు. నిజంగానే నెహ్రుకు సెంగోల్ అందించారనే విషయాన్ని గుర్తిస్తూనే, ఈ సంప్రదాయం అధికార మార్పిడికి ప్రతీకగా భావించడానికి ఆధారాలు లేవు అని మాత్రమే పేర్కొంది.

చివరగా, సెంగోల్ ప్రాముఖ్యతను గుర్తిస్తూనే, ఈ సంప్రదాయం అధికార మార్పిడికి ప్రతీకగా భావించడానికి ఆధారాలు లేవు అని మాత్రమే హిందూ పత్రిక పేర్కొంది.

Share.

About Author

Comments are closed.

scroll