Fake News, Telugu
 

మమతా బెనర్జీ ఇటీవల తలకు గాయమైనట్లు నటిస్తున్నట్లు పేర్కొంటూ సంబంధం లేని ఫోటోలను షేర్ చేస్తున్నారు

0

ఇటీవల 14 మార్చి 2024న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలకు గాయం అయినట్లు పలు వార్తసంస్థలు, తృణముల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే  మమతా బెనర్జీ తన తలకు గాయం అయినట్లు నటిస్తున్నారు అని చెప్తూ ఉన్న పలు పోస్టులు (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటికి మద్దతుగా మమతా బెనర్జీ తలకు సంబంధించిన గాయాలను చూపుతున్న పలు ఫోటోలను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల తలకు గాయమైనట్లు నటించారు.

ఫాక్ట్(నిజం): వేర్వేరు సందర్భాలలో తీసిన ఫోటోలను ఒకే సంఘటనకు సంబంధించినవి అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు. మొదటి ఫోటో వాస్తవంగా ఇటీవల 14 మార్చి 2024న మమతా బెనర్జీకి తగిలన గాయాన్నే చూపిస్తున్నది. రెండవ ఫోటో జనవరి 2024లో జరిగిన కారు ప్రమాదం తర్వాత తలకు బ్యాండేజ్ కట్టుతో ఆమె మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో తీసింది. మూడవ ఫోటో, 19 మార్చి 2024న కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో భవనం కూలిన ఘటనలో అక్కడ స్థానికులతో మాట్లాడుతున్న సమయంలో తీసింది.కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

మొదటి ఫోటో:

ఈ వైరల్ ఫోటోలకి సంబంధించిన సమాచారం కోసం, ఇంటర్నెట్‌లో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఈ మమతా బెనర్జీ నుదిటి మధ్యలో రక్తస్రావం అయిన గాయంతో ఉన్న మొదటి చిత్రాన్ని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక X (ఆర్కైవ్) ఖాతా ద్వారా 14 మార్చి 2024న షేర్ చేసారు అని తెలిసింది. “మా ఛైర్‌పర్సన్ మమతా బెనర్జీకి పెద్ద గాయం అయింది. దయచేసి ఆమె కోసం మీరు ప్రార్థన చేయండి”. అనే శీర్షికతో ఈ ఫోటోలు పోస్ట్ చేయబడ్డాయి. కావున మొదటి ఫోటో వాస్తవంగా ఇటీవల మమతా బెనర్జీకి తగిలన గాయనే చూపిస్తున్నది అని తెలుస్తుంది.

రెండో ఫోటో:

మమతా బెనర్జీ నుదిట ఎడమవైపు బ్యాండేజ్ కట్టు(Bandage) ఉన్న రెండవ ఫోటోకి సంబంధించిన సమాచారం కోసం కోసం రివర్స్ ఇమేజ్ చేయగా, 24 జనవరి 2024న, ఇలాంటి ఫొటోనే రిపోర్ట్ చేస్తూ వెలువడిన పలు వార్తా కథనాలు లభించాయి(ఇక్కడ & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పుర్బా బర్ధమాన్‌లో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమీక్షా సమావేశం నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మమతా బెనర్జీ కారు మరో వాహనంతో ఢీకొనకుండా సడన్ బ్రేక్ వేయడంతో,  ఆమె నుదిటిపై గాయమైంది, ఈ ఘటన తర్వాత మమతా బెనర్జీ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారని ఈ నివేదికలు పేర్కొనాయి. ఈ మీడియా సమావేశాన్ని పలు వార్త సంస్థలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ మీడియా సమావేశం సమయంలో తీసిన ఒక ఫొటోనే, ఇప్పుడు వైరల్‌గా మారింది అని అర్థమవుతుంది.

మూడవ ఫోటో:

ఈ మూడవ వైరల్ ఫోటోకి సంబంధించిన సమాచారం కోసం వెతకగా, ఇటీవల తలకు గాయమై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మమతా బెనర్జీ, 18 మార్చి 2024న గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించినట్లు, మరియు అక్కడ నివసించే స్థానికులతో మాట్లాడినట్లు పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). దీన్ని బట్టి మమతా బెనర్జీ భవనం కూలిన ఘటనలో అక్కడ స్థానికులతో మాట్లాడుతున్న సమయంలో తీసిన ఒక ఫొటోనే, ఇప్పుడు వైరల్‌గా మారింది అని అర్థమవుతుంది.

చివరగా, ఇటీవల మమతా బెనర్జీ తలకు గాయం కాలేదన్న వాదన తప్పు. వేర్వేరు సందర్భాలలో తీసిన ఫోటోలను ఒకే సంఘటనకు సంబంధించినవి అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll