“రోడ్డు మీద బుడగలు అమ్మే ఈ ముస్లిం స్త్రీకి ప్రస్తుతం ఇప్పటివరకు 25 మంది పిల్లలు పుట్టారు అంటా…. ఈమెకి టార్గెట్ 50 మంది పిల్లలును కనడం అట. హిందువులు మాత్రం కుటుంబ నియంత్రణ చేసుకోవాలి. ముస్లింలుకు మాత్రం కుటుంబ నియంత్రణ లేదు. ఒక్కొక్క ముస్లింలు స్త్రీ 25-50 మంది పిల్లలను కనాలి. ఇది కాంగ్రెస్ వారు తయారు చేసిన కుటుంబ నియంత్రణ పాలసీ “అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఓ మహిళ తనకు 25 మంది పిల్లలు అని, 50 మంది పిల్లలను కనాలని ఉందని చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశానికి చెందిన ఒక ముస్లిం యువతి తనకు ఇప్పటివరకు 25 మంది పిల్లలు పుట్టారని, 50 మంది పిల్లలను కనాలని ఉందని చెప్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలో ఉన్న యువతి పాకిస్థాన్‌కు చెందింది. ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోను పాకిస్థాన్‌కు చెందిన ‘AD Malik Official’ అనే యూట్యూబ్ ఛానెల్ 25 జనవరి 2023న షేర్ చేసింది. అలాగే, ఇదే యువతికి సంబంధించిన వీడియో ‘Lahore 42TV’ అనే మరో పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెల్‌లో లభించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ప్రస్తుతం షేర్ అవుతున్న వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న అధిక నిడివి గల వీడియోను ‘AD Malik Official’ అనే యూట్యూబ్ ఛానెల్ 25 జనవరి 2023న “22 Sala Larki Ka interview(22 సంవత్సరాల యువతి ఇంటర్వ్యూ)” అనే శీర్షికతో షేర్ చేసినట్లు తెలిసింది. వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో పాకిస్థాన్‌లోని లాహోర్ నగరానికి సంబంధించినదిగా తెలుస్తుంది. ఈ వీడియోలో యువతి తన పేరు రబియా అని, 11 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యిందని, ఇప్పుడు తనకు 22 ఏళ్లు, 25 మంది పిల్లలు ఉన్నారని చెప్పడం చూడవచ్చు.
ఈ ఛానల్ యొక్క వివరాలను పరిశీలించగా, ఈ ఛానల్ పాకిస్థాన్‌కు చెందినదిగా తెలుస్తుంది. అలాగే, ఈ ఛానల్ లోని వీడియోలు అన్ని పాకిస్థాన్‌కు సంబంధించిన వార్తలను ప్రసారం చేస్తుంది అని మేము గమనించాం (ఇక్కడ, ఇక్కడ).
తదుపరి ఈ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఇదే వైరల్ వీడియోలోని యువతిని అదే ప్రదేశంలో మరొక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో ఒకటి “Lahore 42TV” అనే యూట్యూబ్ ఛానెల్‌లో లభించింది. ఈ వీడియోను 25 జనవరి 2023న “22 Saal ki Laiba Ne 25 Bachay Peda kr Liyay”(22 సంవత్సరాల యువతి 25 మంది పిల్లలకు జన్మనిచ్చింది) అనే శీర్షికతో షేర్ చేసింది. దీన్ని బట్టి వైరల్ వీడియోలో ఉన్న మహిళ పాకిస్థాన్‌కు చెందినదిని మనం నిర్థారించవచ్చు. అయితే, ఈ యువతికి నిజంగానే 25 మంది పిల్లలు ఉన్నారని చెప్పే ఎలాంటి రిపోర్ట్స్ మాకు లభించలేదు, కావున మేము ఈ యువతికి 25 మంది పిల్లలు ఉన్నారా, లేదా అనే విషయం నిర్ధారించలేము.
చివరగా, తనకు 25 మంది పిల్లలు ఉన్నారని, 50 మంది పిల్లలను కనాలనుకుంటున్నానని ఓ యువతి చెప్తున్న ఈ వీడియో పాకిస్థాన్‌కు చెందింది.