Fake News, Telugu
 

రోష్ని చట్టం అనేది జమ్మూ కాశ్మీర్ లోని ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులు అందించే అంశానికి సంబంధించిన చట్టం

0

జమ్మూ కాశ్మీర్ నుండి పారిపోయిన హిందువుల ఇళ్ళు, దుకాణాలు, భూమి మరియు పొలాలను ముస్లింలకి ఇవ్వడానికి ఫరూక్ అబ్దుల్లా రోష్ని చట్టాన్ని తీసుకొచ్చాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రోష్ని చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ నుండి పారిపోయిన హిందువుల భూములను ముస్లింలకి అప్పగించారు.

ఫాక్ట్ (నిజం): జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి అనుభవిస్తున్నారో, వారు ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లిండం ద్వారా ఆ భూముల యొక్క పూర్తి యాజమాన్య హక్కులు పొందగలిగే అవకాశం ఇస్తూ 2001లో రోష్ని చట్టాన్ని రూపొందించారు. రోష్ని చట్టం కేవలం ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులు అందించే అంశానికి సంబంధించిన చట్టం, దీనికి హిందువుల భూములు లేదా ఆస్తులకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి అనుభవిస్తున్నారో, వారు ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించడం ద్వారా ఆ భూముల యొక్క పూర్తి యాజమాన్య హక్కులు పొందగలిగే అవకాశం ఇస్తూ 2001లో అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ స్టేట్ ల్యాండ్ (ఆక్రమణదారులకు యాజమాన్య హక్కులను ఇవ్వడం) చట్టం, 2001 ని తీసుకొచ్చారు. దీనినే రోష్ని చట్టం అని కూడా అంటారు.

ఈ చట్టంలో 1990ని కట్-ఆఫ్ సంవత్సరంగా పరిగణించారు, అంటే 1990 కన్నా ముందు ఏవైతే ప్రభుత్వ భూములు ఆక్రమించబడ్డాయో కేవలం ఆ భూములకు సంబంధించి ఈ చట్టం కింద యాజమాన్య హక్కులు పొందేందుకు అర్హులు. జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మించడానికి అవసరమైన నిధులను సేకరించే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించడంతో ఈ చట్టాన్ని రోష్ని చట్టం అని పిలుస్తారు. ఐతే ఈ చట్టం కింద భూముల యొక్క ధరలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తుంది.

ఐతే 2001లో రూపొందించిన చట్టంలోని కట్-ఆఫ్ సంవత్సరాన్ని 2004గా మారుస్తూ 2005లో సవరణ చేయగా, కట్-ఆఫ్ సంవత్సరాన్ని 2007కి మారుస్తూ  అప్పటి ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ మళ్ళి సవరణలు చేసారు. అంటే 2007 కన్నా ముందు వరకు ఏవైతే ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నాయో, వాటికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. అలాగే ఈ సవరణలలో ఎంత విస్తీర్ణం గల భూమికి ఎంత ధర చెల్లించాలో పేర్కొనగా, వ్యవసాయ భూములకు కేవలం నామమాత్రంగా కణాల్ (ఎకరంలో ఎనిమిదో వంతు)కి వంద రూపాయలు చెల్లిస్తే చాలు.

ఐతే కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (కాగ్) 2014లో సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ లో ఈ చట్టం కింద భూముల ధరలు నిర్ణయించే విషయంలో అవకతవకలు జరిగాయని పేర్కొంది. ఐతే ఈ చట్టం అనుకున్న లక్ష్యాలను చేరుకోకపోవడం, భూములు ధరలకు సంబంధించి అవినీతి జరగడంతో 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఈ రోష్ని చట్టాన్ని రద్దుచేసారు. 2020లో జమ్మూ కాశ్మీర్ హై కోర్ట్ ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధం అన్ని చెప్పి రద్దు చేసింది.

క్లుప్తంగా చెప్పాలంటే రోష్ని చట్టం అనేది ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించింది, హిందువుల భూములకు సంబంధించింది కాదు. పైగా ఈ భూముల ధరలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తుంది. 2007లో చేసిన సవరణల ప్రకారం కేవలం వ్యవసాయ భూములు మాత్రమే వంద రూపాయలు చెల్లించి అనుభవదారులు పొందవచ్చు. ప్రస్తుతానికి ఈ చట్టాన్ని రద్దు చేసారు. 

చివరగా, రోష్ని చట్టం అనేది జమ్మూ కాశ్మీర్ లోని ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులు అందించే అంశానికి సంబంధించిన చట్టం.

Share.

About Author

Comments are closed.

scroll