Fake News, Telugu
 

బీజేపీ ఎంపీ తమ పార్టీ ఎమ్మెల్యే నీ బూటుతో కొడుతున్న పాత వీడియోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొట్టుకుంటున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు

0

ఢిల్లీలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో ఎంపీ సంజయ్ సింగ్ తన పార్టీ ఎమ్మెల్యే నీ బూటుతో కొడుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఢిల్లీలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో ఎంపీ సంజయ్ సింగ్ తన పార్టీ ఎమ్మెల్యే నీ బూటుతో కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న ఘటన 2019లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బీజేపీ సమావేశంలో జరిగింది. బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి తన పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ తో వాదనకు దిగుతూ కొట్టుకుంటున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది.  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఒక ప్రాజెక్ట్ పునాది రాయి పై తమ పేర్లు పెట్టుకోవడం కోసం వారు ఈ ఘర్షణకు దిగినట్టు తెలిసింది. ఈ వీడియో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘NDTV’ న్యూస్ సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 06 మర్చి 2019 నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బీజేపీ సమావేశంలో ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్టు వీడియో వివరణలో తెలిపారు. సంత్ కబీర్ నగర్ నియోజకవర్గానికి అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి తన పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ తో వాదనకు దిగుతూ అతన్ని బూటుతో కొట్టినట్టు ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఒక ప్రాజెక్ట్ పునాది రాయి పై తమ పేర్లు పెట్టుకోవడం కోసం వారు ఈ ఘర్షణకి దిగినట్టు తెలిసింది. 2019లో జరిగిన ఈ ఘర్షణకు సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, ఘర్షణకు దిగిన నేతల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు కలిగిన పోస్టర్ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి, వీడియోలో ఘర్షణకు దిగిన నేతలు బీజేపీకి చెందినవారని, ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ వీడియోతో ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, బీజేపీ ఎంపీ తన పార్టీ ఎమ్మెల్యే నీ బూటుతో కొడుతున్న పాత వీడియోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొట్టుకుంటున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll