Fake News, Telugu
 

యేసుక్రీస్తు ఫోటోకి పూజ చేయమని పూజారిని ఎస్పీ దివ్య సారా థామస్ ఒత్తిడి చేయలేదు

0

కర్ణాటక చామరాజనగర్ ఎస్పీ దివ్య సారా థామస్ గుడికి వెళ్లి పూజారి పై ఒత్తిడి వేసి యేసుక్రీస్తు ఫోటోని గర్భగుడిలో పెట్టించి, ఫోటోకి పూజ చేయించిందని చెప్తూ కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: చామరాజనగర్ ఎస్పీ దివ్య సారా థామస్ గుడికి వెళ్లి పూజారి పై ఒత్తిడి వేసి యేసుక్రీస్తు ఫోటోకి పూజ చేయించింది.

ఫాక్ట్ (నిజం): యేసుక్రీస్తు ఫోటోకి పూజ చేయమని తన పై ఎస్పీ దివ్య సారా థామస్ ఒత్తిడి వేయలేదని ఆ గుడి పూజారి వివరణ ఇచ్చాడు. ఎస్పీ క్రైస్తవురాలు కాబట్టి, ఆమె గుడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఫోటోని గర్బగుడిలో పెట్టి, తరువాత ఆమెకు బహుకరించారు. తన చర్యల వల్ల ఎవరైనా హిందువులు బాధపడితే వారికి క్షమాపణలు అని పూజారి తెలిపాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫోటోల్లోని ఘటనకు సంబంధించిన సమాచారం కోసం గూగుల్ లో వెతకగా, కొన్ని కన్నడ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఫోటోల్లోని ఘటన 05 ఆగస్టు 2020 న (అయోధ్య రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన రోజు) జరిగినట్టు ‘ప్రజావాణి’ ఆర్టికల్ లో చదవొచ్చు. ఎస్పీ దివ్య సారా థామస్ రౌండ్స్ లో ఉన్నప్పుడు, ఆమెను పూజారి గుడిలోకి రమ్మని ఆహ్వానించారు. ఆమె క్రైస్తవురాలు కాబట్టి, యేసుక్రీస్తు ఫోటోను గర్భగుడిలో పెట్టి, తరువాత ఆమెకు బహుకరించారు.

ఈ ఘటన పై పూజారి ఇచ్చిన వివరణను ఇక్కడ చూడవొచ్చు. తన చర్యల వల్ల ఎవరైనా హిందువులు బాధపడితే వారికి క్షమాపణలు అని పూజారి తెలిపాడు.

అంతేకాదు, కర్ణాటక రాష్ట్ర పోలీస్ డిపార్టుమెంటు వారు కూడా ఈ విషయం పై వివరణ ఇస్తూ తమ ఫ్యాక్ట్-చెక్ పోర్టల్ లో ఈ విధంగా రాసారు – ‘కొత్త ఎస్పీ వేరే మతానికి చెందినవారని తెలుసుకున్న పూజారి పూజ చేసిన తరువాత ఆమెకు యేసుక్రీస్తు ఫోటోతో పాటు హిందు దేవతల ఫోటోలను కూడా బహుమతిగా ఇచ్చాడు. యేసుక్రీస్తు ఫోటోకి అర్చన చేయమని ఎస్పీ పూజారిని లేదా భక్తులను బలవంతం చేయలేదు. ఆమె తనతో ఎలాంటి ఫోటోలను ఆలయానికి తీసుకెళ్లలేదు. ఈ సంఘటన యొక్క ఫోటోలు తప్పుగా సోషల్ మీడియాలో ప్రసారం చేయబడుతున్నాయి’.

కొందరు కావాలనే అల్లర్లు చేయడానికి ఇలా ప్రచారం చేస్తున్నారు. నా భర్త హిందువు, నేను క్రిస్టియన్. నేను ఆలయానికి వెళ్ళాను కానీ పూజారిని పూజలు చేయమని బలవంతం చేయలేదు’ అని ‘ది న్యూస్ మినట్’ వారికి ఎస్పీ దివ్య సారా థామస్ తెలిపింది.

చివరగా, యేసుక్రీస్తు ఫోటోని గర్బగుడిలో పెట్టిన మాట వాస్తవమే కానీ ఎస్పీ దివ్య సారా థామస్ తనతో యేసుక్రీస్తు ఫోటోను తీసుకురాలేదు మరియు దానిని గర్భగుడిలో పెట్టి పూజ చేయమని ఆలయ పూజారి పై ఒత్తిడి వేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll