నకిలీ Paytm స్కామ్ చేస్తూ దొరికిన మహిళ అంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి మొదట దుకాణదారుడి నుండి కొన్ని వస్తువులను తీసుకుని, ఆపై తన ఫోన్‌లో ఆన్‌లైన్‌లో Paytm ద్వారా డబ్బు చెల్లించినట్టు రసీదు చూపిస్తుంది. ఐతే నిజానికి తను చెల్లించింది ఒక నకిలీ ఆప్‌లో (Spoof PayAtm). ఇది ఒక ఆన్లైన్ ఫ్రాడ్ అని కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని బయటపెడతారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: నకిలీ Paytm స్కామ్ చేస్తూ దొరికిన మహిళ వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో ఆన్‌లైన్ చెల్లింపులలో జరిగే మోసంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వీడియో. వైరల్ వీడియోలోనిది నిజమైన ఘటన కాదు, అది నటులతో చిత్రీకరించింది. నిశాంత్ సోని అనే ఒక ఆర్టిస్ట్ ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ఈ వీడియోని రూపొందించి, తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసాడు. తను షేర్ చేసిన పూర్తి వీడియో చివరిలో ఈ వీడియో అవగాహన కోసం రుపొందించామని తన స్పష్టంగా చెప్పాడు. ఐతే వీడియో చివర్లో ఇది అవగాహన కోసం రుపొందించిన వీడియో అని చెప్పే భాగాన్ని కట్ చేసి మిగతా భాగాన్ని నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం వెతికే క్రమంలో, ‘NS ki Duniya’ ఫేస్‌బుక్ పేజీలో వైరల్ వీడియో యొక్క పూర్తి వెర్షన్ మాకు కనిపించింది. నిశాంత్ సోని అనే ఒక ఆర్టిస్ట్ ఈ పేజీని నడిపిస్తున్నాడు, ఇతని ఫేస్‌బుక్ పేజీకి 18 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.
ఐతే ఈ పూర్తి వెర్షన్ వీడియో చివర్లో నిశాంత్ సోని స్వయంగా తాము ఈ వీడియో ఆన్‌లైన్ చెల్లింపులలో జరిగే మోసంపై అవగాహన కల్పించేందుకు రూపొందించామని స్పష్టంగా చెప్పాడు. దీన్నిబట్టి వైరల్ పోస్టులో చెప్తునట్టు ఈ నిజమైన ఘటన కాదు, నటీనటులతో చిత్రీకరించింది అని అర్థమవుతుంది. ఇదే విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన ఇదే వీడియోలో కూడా స్పష్టం చేసాడు.
నిశాంత్ సోని ఫేస్‌బుక్ పేజీలో ఇలాంటి పలు అవగాహన వీడియోలు ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఇలాంటి పలు అవగాహన వీడియోలను నిజమైన ఘటనలంటూ షేర్ చేసిన పలు పోస్టులను ఫాక్ట్-చెక్ చేస్తూ FACTLY రాసిన కథనాలు ఇక్కడ , ఇక్కడ, మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, అవగాహన కల్పించేందుకు రూపొందించిన వీడియోని, PAYTM స్కాం చేస్తూ దొరికిన మహిళ అంటూ షేర్ చేస్తున్నారు.