మొబైల్ రిపేరింగ్ పేరుతో అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలు, మెసేజిలను హ్యాక్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసిన ముస్లిం వ్యక్తి, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. తన మొబైల్ షాపుకు రిపేరింగ్ కోసం వచ్చిన అమ్మాయిల ఫోన్లలో ‘Spy Human’ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి, ఆ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలని పొంది వారిని శారీరకంగా లోబరుచుకున్నాడని, ఇది కొత్త రకమైన లవ్ జిహాదని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మొబైల్ రిపేరింగ్ పేరుతో అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలు, మెసేజిలను హ్యాక్ చేసిన ముస్లిం వ్యక్తి దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసింది ఒక స్క్రిప్టెడ్ వీడియో. మొబైల్ రిపేరింగ్ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు నిజజీవితంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, ఈ వీడియోలోని 0:10 మరియు 1:00 నిమిషాల దగ్గర వివరణ కనిపించడం మనం చూడవచ్చు. ఈ వీడియో కేవలం వినోదం మరియు అవగాహన కోసం రూపొందించిందని, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని వివరణలో తెలిపారు. అంతేకాదు, ఈ వీడియోలో పట్టుబడ్డ మొబైల్ రిపేర్ చేసే అబ్బాయి ముస్లిం మతానికి చెందిన వాడని ఎక్కడా పేర్కొనలేదు.
ఈ పోస్టు చివరిలో దీపికా షా రూపొందించిన మరికొన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి, అంటూ దీపికా షా పేరుతో ఉన్న ఫెస్‌బూక్ పేజి లింక్ పెట్టారు. పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం దీపికా షా ఫెస్‌బూక్ పేజిలో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని దీపికా షా 25 డిసెంబర్ 2021 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. అమ్మాయిల మొబైలులోని వ్యక్తిగత చిత్రాలు వారికి తెలియకుండా హ్యాక్ చేసిన సంఘటన అంటూ వీడియో వివరణలో దీపికా షా తెలిపింది. దీపికా షా ఫేస్ బుక్ పేజీలో ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలు చాలా పోస్ట్ చేసి ఉన్నాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలను కేవలం వినోదం మరియు ప్రజలకు అవగాహన కోసం రూపొందిస్తున్నట్టు అన్ని వీడియోలలో వివరణ ద్వారా తెలిపారు. అంతేకాదు, ఇలాంటి వీడియోలకి స్పాన్సర్షిప్ లేదా వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించవలిసిన ఈ-మెయిల్ అడ్రస్ సమాచారాన్ని కూడా వీడియోలో ఇచ్చారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇదివరకు, ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలని లవ్ జిహాద్ కి జత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, FACTLY ఆ వీడియోలకి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, మొబైల్ రెపైరింగ్ పేరుతో అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలని హ్యాక్ చేస్తున్న ముస్లింలు అంటూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.