Fake News, Telugu
 

సంబంధం లేని పాత ‘అవును కోసి చంపిన’ వీడియోని కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక జరిగిన ఘటనగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని బీజేపీ జెండా పైన ఆవును కోసి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సంబరాలు చేసుకుంటున్నారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇదే వీడియోని ఇక్కడ కూడా చూడవచ్చు

క్లెయిమ్: 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినందున బీజేపీ జెండా పైన ఆవును కోసి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ ఘటన 30 జనవరి 2022లో మణిపూర్ రాష్ట్రంలోని లిలాంగ్ ప్రాంతంలో జరిగింది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో కొందరు నేతలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వనందున ఆ నేతలకు చెందిన అనుచరులు ఆందోళన చేస్తూ హింసకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు బీజేపీ జెండాపై ఆవును చంపుతూ మణిపూర్ ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిని వ్యక్తిగతంగా దూషించారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి బాధ్యులైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో జనవరి 2022 (ఆర్కైవ్ లింక్) నాటి నుంచి ప్రచారంలో ఉన్నట్లు గుర్తించాం.

ఈ వీడియోపై మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతకగా ఈ ఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఇంఫాల్ ఫ్రీ ప్రెస్ వంటి ప్రముఖ వార్తా సంస్థలు ప్రచురించిన కథనాలు లభించాయి.

ఈ కథనాల ప్రకారం, 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులను ఖరారు చేసే సమయంలో కొందరు నేతలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వనందున ఆ నేతలకు చెందిన అనుచరులు ఆందోళన చేస్తూ హింసకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా 30 జనవరి 2022న  తౌబల్ జిల్లాలోని లిలాంగ్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు బీజేపీ జెండాపై ఆవును చంపుతూ మణిపూర్ ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని వ్యక్తిగతంగా దూషించారు. ఈ ఘటనకు బాధ్యులైన నజ్బుల్ హుస్సేన్, అబ్దుల్ రషీద్, ఆరిఫ్ ఖాన్ అనే ముగ్గురు వ్యక్తులపై సంబంధిత సెలక్షన్ల కింద సుమోటోగా కేసు నమోదు చేసి వారిని లిలాంగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీని ఇక్కడ చూడవచ్చు. కోర్టు కేసు వివరాలను ఇక్కడ చూడవచ్చు. (CNR NO: MNTB020000542022)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ మరియు ఫలితాల వెల్లడి మే  2023లో జరిగినందున, వైరల్ వీడియోలోని ఘటనతో దీనికి సంబంధం ఉండే అవకాశం లేదు.

చివరిగా, జనవరి 2022లో మణిపూర్లో జరిగిన సంఘటన వీడియోని కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జరిగిన సంఘటనగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll