Fake News, Telugu
 

మద్యం కోసం ఎగబడుతున్న ఈ వీడియోలోని వ్యక్తులు ఢిల్లీ లో నిరసన చేస్తున్న రైతులు కాదు

0

ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో, రైతులు మద్యం సేవిస్తున్న దృశ్యాలంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. మద్యం కోసం జనాలు ఎగబడుతున్న ఒక వీడియోని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో, రైతులు మద్యం సేవిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. ఈ వీడియో కనీసం ఏప్రిల్ 2020 నుంచి ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను, పార్లమెంట్  20 సెప్టెంబర్ 2020 నాడు ఆమోదం తెలిపింది. దీన్ని బట్టి, ఈ వీడియో కొత్త వ్యవసాయ చట్టాల ఆమోదం పొందక ముందు నుంచే ఇంటర్నెట్ లో షేర్ అవుతునట్టు చెప్పవచ్చు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్టులు దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో ఏప్రిల్ 2020 నుండి ఇంటర్నెట్ లో బాగా షేర్ అయినట్టు తెలిసింది. మద్యంని ఇలా దానం చేస్తారని ఎవ్వరు ఉహించి ఉండరు, అని కామెంట్ చేస్తూ చాలా మంది యూసర్లు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకి మద్యం దానం చేస్తున్న దృశ్యాలని ఒక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలని 14 సెప్టెంబర్ 2020 నాడు లోక్ సభలో ప్రవేశపెట్టింది. 17 సెప్టెంబర్ 2020 నాడు లోక్ సభ, ఈ చట్టాలకి ఆమోదం తెలిపింది. 20 సెప్టెంబర్ 2020 నాడు పార్లమెంట్ ఉభయ సభలు కొత్త వ్యవసాయ బిల్లులకి ఆమోదం తెలిపినట్టు PIB ప్రెస్ రిలీజ్ జారి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, వివిధ రైతు సంఘాలు తమ నిరసన కార్యక్రమాలని ఆ తరువాత ఉదృతం చేసారు.

పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఆమోదించక ముందు నుంచే ఈ వీడియో ఇంటర్నెట్ లో షేర్ అయినట్టు ఈ వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని చూపిస్తూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో రైతులు మద్యం ఎగబడుతున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll